నెల్లూరు సిటీ: రూరల్ మండలంలోని వేదగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 6వ తేదీ వరకు జరుగుతాయని నెల్లూరు ఆర్డీఓ అనూష తెలిపారు. ఆలయ ప్రాంగణంలో బుధవారం వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఐపీ దర్శనాలను ఉదయం 8 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చిన లోటుపాట్లు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎండాకాలం దృష్ట్యా చలువ పందిళ్లు వేస్తున్నట్లు తెలిపారు. భక్తులకు మంచినీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ అందిస్తామన్నారు. త్వరితగతిన స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశామన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అత్యవసర మందులు, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆలయ చైర్మన్ అచ్యుత్‌రెడ్డి, ఈఓ గోపీ పాల్గొన్నారు.


