చిల్లకూరు: గూడూరులోని ఎస్‌కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఫీజుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారంటూ విద్యార్థులు బుధవారం కళాశాల ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపకార వేతనాలతో తనకు సంబంధం లేదంటూ, ఫీజు చెల్లించకుంటే కళాశాల నుంచి బయటకు పంపిస్తానని హెచ్చరిస్తున్నారని తెలిపారు. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఫీజులు చెల్లించే వారన్నారు. నేడు అవి అందకపోవడంతో ప్రభుత్వం అందించే ఉపకార వేతనాలను ఫీజుల కింద జమ చేసుకోవాలని చెబుతున్నా ప్రిన్సిపల్ వైఖరిలో మార్పు లేదన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి పేద విద్యార్థుల ఫీజులు చెల్లించాలని, ప్రిన్సిపల్‌పై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.


