సోమశిల: అనంతసాగరం మండల పరిధిలో పలు రహదారులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. భారీ గుంత కారణంగా బుధవారం జరిగిన ప్రమాదంలో ఒకరు గాయపడ్డారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరుగుతోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల కథనం మేరకు.. అనంతసాగరం ఎస్సీ కాలనీకి చెందిన కె.వాసు తన స్నేహితుడి వివాహానికి ఆత్మకూరుకు మోటార్‌బైక్‌పై వెళ్లాడు. తిరిగి ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో ముత్తుకూరు వద్ద కొమ్మలేరు బ్రిడ్జిపై ఉన్న లోతైన గుంతలో బైక్ అదుపుతప్పి పడింది. ఈ ప్రమాదంలో వాసు తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్నేహితులు అతడిని 108 అంబులెన్స్‌లో ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కాగా సోమశిల – ఆత్మకూరు ప్రధాన రహదారి అధ్వానంగా మారడంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.


