నెల్లూరు(క్రైమ్): క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లను నెల్లూరు దర్గామిట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెంచారు. ఈ నేపథ్యంలో మాగుంట లేఅవుట్‌లోని ఓ లాడ్జీపై పోలీసులు దాడిచేసి బెట్టింగ్ ఆడుతున్న కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం మేరకు నెల్లూరు నగరం, పొదలకూరు ప్రాంతానికి చెందిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సోమవారం వెలుగులోకి వచ్చింది.
భవిత కేంద్రాలకు కరదీపికలు
నెల్లూరు(టౌన్): దివ్యాంగ విద్యార్థుల అభ్యసనను మెరుగుపరిచేందుకు జిల్లాలోని భవిత కేంద్రాలకు ప్రత్యేక మాడ్యూల్ పేరుతో 7 రకాల కరదీపికలు అందజేస్తున్నట్లు డీఈఓ బాలాజీరావు తెలిపారు. సోమవారం నెల్లూరులోని విద్యాశాఖ కార్యాలయంలో కరదీపికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి, నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు నాణ్యమైన, సాంకేతిక ఆధారిత విద్య అందించి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ లక్ష్యమన్నారు. జిల్లాలోని 38 భవిత కేంద్రాలకు 2,088 కరదీపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సహిత విద్య సమన్వయకర్త పి.ప్రసాద్‌రావు, ఏఎంఓ సుధీర్‌బాబు, డిప్యూటీ డీఈఓ జానకిరామ్, ఎంఈఓ తిరుపాల్, ఐఈఆర్పీలు పాల్గొన్నారు.
గోడను ఢీకొట్టిన ట్రాక్టర్
● వృద్ధుడి మృతి
సంగం: మండలంలోని జెండాదిబ్బ గ్రామం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. పుట్టావారిగుంట వద్ద రోడ్డు పక్కన గోడపై సుబ్బారెడ్డి (72) అనే వృద్ధుడి కూర్చొని ఉన్నాడు. ఈ క్రమంలో తాటిమొద్దుల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ గోడని ఢీకొట్టింది. దీంతో సుబ్బారెడ్డి కాలువలో పడిపోయి మృతిచెందాడు. వాహనం కూడా కాలువలోకి దూసుకెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాద స్థలాన్ని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించారు.
బైక్‌పై వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
అల్లూరు: ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌ను మోటార్‌బైక్ ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు బస్టాండ్ సెంటర్‌లో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. అల్లూరు రాయాజీ వీధికి చెందిన గుర్రం సాయిప్రదీప్ (25) స్థానికంగా మొబైల్ షాపులో పనిచేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఆదివారం రాత్రి బైక్‌పై వెళ్తూ బస్టాండ్ సెంటర్‌లో యూటర్న్ తీసుకుంటున్న తరుణంలో డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనపై పోలీస్ కేసు నమోదు కాలేదు.


