● బిహార్ గ్యాంగ్ అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): రైల్వే ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని వారి ఫోన్లు, నగదును దోచేస్తున్న ఐదుగురు సభ్యులున్న బిహార్ గ్యాంగ్‌ను సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. 21 సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులోని సంతపేట పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నగర ఏఎస్పీ దీక్ష, స్థానిక ఇన్‌స్పెక్టర్ వైవీ సోమయ్యతో కలిసి గ్యాంగ్ వివరాలను వెల్లడించారు. బిహార్ రాష్ట్రం అరారియా జిల్లాకు చెందిన పప్పుకుమార్, మనోజ్‌కుమార్, సీతామఢి జిల్లాకు చెందిన రంజిత్ కుమార్, రాజేష్‌రాయ్, భాగ్‌బెట్టియ ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్ ముఠాగా ఏర్పడ్డారు. కొంతకాలంగా వారు నెల్లూరు రైల్వేస్టేషన్ వద్ద ఉంటూ ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు తెరలేపారు. నిందితులు రైల్వేస్టేషన్ బయట ఉంటూ రైలు ఎక్కేందుకు వచ్చేవారితో మాటలు కలుపుతారు. తమకు రైల్వే ఉద్యోగులు తెలుసని, టికెట్ రిజర్వేషన్ చేయిస్తామని నమ్మిస్తారు. మీ ఫోన్‌కు ఓటీపీ వచ్చిన వెంటనే ఫోన్‌పే ద్వారా నగదు పంపాలని, ప్రయాణికుడికి అనుమానం రాకుండా పాస్‌వర్డు తెలుసుకుంటారు. పక్కనే రిజర్వేషన్ కార్యాలయం ఉందని అక్కడికి వెళ్లి టికెట్ రిజర్వేషన్ చేయించుకుని వస్తామని సెల్‌ఫోన్ తీసుకుంటారు. గ్యాంగ్‌లోని ఓ వ్యక్తిని వారితో ఉంచి మిగిలిన వారు అక్కడ్నుంచి జారుకుంటారు. అనంతరం దుకాణాల వద్దకు వెళ్లి ఫోన్‌పేలో వేసి వారి నుంచి చేతికి నగదు తీసుకుని ఉడాయిస్తారు. రిజర్వేషన్‌కు వెళ్లినవారు ఎంతకీ రాకపోవడంతో ప్రయాణికులు గాబరాపడుతుండగా ఇదే అదునుగా భావించిన వారివద్దనున్న నిందితుడు తాను వెళ్లి తీసుకొస్తానని పరారవుతాడు. ఈ తరహాలో నిందితులు పలువుర్ని మోసగించసాగారు.
వెలుగులోకి ఇలా..
అజాద్ సెంటర్ సమీపంలో హేమంత్ కుమార్ ప్రొవిజన్స్ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈనెల 12వ తేదీన నిందితులు దుకాణం వద్దకు వచ్చి ఫోన్‌పేలో నగదు వేసి చేతికి రూ.55 వేలు తీసుకెళ్లారు. ఆ నగదు బ్లాక్ అవడంతో బాఽధితుడు బ్యాంక్‌కు వెళ్లి ఆరాతీయగా మోసం వెలుగులోకి వచ్చింది. దీప్‌కుమార్ శర్మ అనే వ్యక్తి తన ఖాతాలోని రూ.30 వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారనే ఫిర్యాదుతో ఆ మొత్తాన్ని బ్లాక్‌చేసినట్లు వెల్లడైంది. దీంతో తనను మోసగించిన వారిపై చర్యలు తీసుకోవాలని హేమంత్‌కుమార్ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్ పడమర వైపున నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించగా మోసాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో నిందితులను అరెస్ట్ చేసి రూ.6 లక్షల విలువైన 21 సెల్‌ఫోన్లు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన సంతపేట ఎస్సైలు జి.బాలకృష్ణ, ఎం.అనిల్‌రెడ్డి, సుల్తాన్‌బాషా, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.


