● కొండాపురం చేరిన
శ్రీనివాసులు మృతదేహం
● రూట్ మార్చి పాత ఇంటికి తరలింపు
● నిరసనగా రోడ్డుపై బైఠాయించిన
బంధువులు
కొండాపురం: చిమ్మిలి శ్రీనివాసులు మృతదేహాన్ని కొత్త ఇంటికి తరలించే విషయంలో పోలీసులు సవాలక్ష ఆంక్షలు విధించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. మండల కేంద్రమైన కొండాపురంలో శ్రీనివాసులు ఇల్లు, షాపులు ఎదుట టీడీపీకి చెందిన కొందరు నాయకులు రాత్రికి రాత్రే అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్రీనివాసులుపై టీడీపీ నేతలు పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను చైన్నెలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం సాయంత్రం మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. వాస్తవానికి కావలి నుంచి కొండాపురం వైపు రావాల్సి ఉంది. కానీ కావలి పెద్దపవని మీదుగా శ్రీనివాసులు పాత ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యులు బంధువులు అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన వివాదాస్పద స్థలానికి మృతదేహాన్ని తరలించాలని లేదంటే ఒప్పుకోమని పోలీసులతో తేల్చి చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో బంధువులు పాత ఇంటి వద్ద అంబులెన్స్ నిలిపి రోడ్డుపై బైఠాయించారు. రాత్రి వరకు పోలీసులు మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచేశారు. గ్రామస్తులు, నాయకులు మాట్లాడి మృతదేహాన్ని పాత ఇంటి వద్దే ఉంచారు. కాగా కొత్త ఇంటి వద్దకు తరలించకుండా పోలీసులు సవాలక్ష ఆంక్షలు విధించారు. కొండాపురం సెంటర్‌లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, డివిజన్‌లో ఉన్న ఎస్సైలు, సిబ్బంది పెద్ద సంఖ్యలో విచ్చేశారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుచేసిన ప్రాంతంలో 144 సెక్షన్ అమలు చేశారు.


