నెల్లూరు(క్రైమ్): జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారోత్సవాలు సోమవారంతో ముగిశాయి. చివరిరోజు నెల్లూరు రైల్వే ఫీడర్స్‌రోడ్డులోని అగ్నిమాపక కేంద్రంలో వైద్యశాలలు, పాఠశాలలు, పరిశ్రమలు, రెడ్‌క్రాస్ సిబ్బంది, షాపింగ్ మాల్స్ ప్రతినిధులతో సెమినార్ నిర్వహించారు. ఫైర్ ఫైటింగ్ సిస్టమ్, ఫైర్ సర్వీస్ యాక్ట్ తదితరాల గురించి వివరించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ వాకా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్న సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రయోగాత్మకంగా వివరించామన్నారు. వారోత్సవాల విజయవంతానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అగ్నిమాపక శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన స్టాల్‌ను పాఠశాలల విద్యార్థులు పరిశీలించారు. వారికి అగ్నిప్రమాద నివారణ చర్యలపై ముద్రించిన కరపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏడీఎఫ్‌ఓ ఎం.రాజా, నెల్లూరు ఫైర్ స్టేషన్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


