● అప్రమత్తం చేసిన ఏఎంవీఐ
● తప్పిన పెను ప్రమాదం
మనుబోలు: 11 కేవీ విద్యుత్ తీగ తెగి హైవేపై పడింది. అదే సమయంలో కారులో వెళ్తున్న ఓ అధికారి అందర్ని అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన మండల పరిధిలోని కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలో సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. విధి నిర్వహణలో భాగంగా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ప్రభాకర్ కారులో గూడూరు నుంచి నెల్లూరుకు వెళ్తున్నాడు. కాగితాలపూరు క్రాస్‌రోడ్డు సమీపంలోకి వచ్చే సరికి హైవేపై 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడిపోయింది. దీనిని చూసిన వెంటనే కారు సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. హైవే పెట్రోలింగ్ సిబ్బంది స్పందించి హైవేపై ఇరువైపులా రాకపోకలను నిలిపివేశారు. విద్యుత్ శాఖ సిబ్బంది వెంటే సరఫరాను నిలిపివేసి తీగను తొలగించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తీగ హైవే పక్కన మొక్కలకు తగిలి మంటలు చెలరేగి పెద్దఎత్తున పొగ వ్యాపించింది. ఇది చూసిన వాహనచోదకులు ఎంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డామో తలుచుకుని హడలిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.


