నెల్లూరు(పొగతోట): ఉపాధి హామీ పనులకు సంబంధించి శ్రామికుల సంఖ్యను రెట్టింపు చేసేలా చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీ గంగాభవాని ఆదేశించారు. నెల్లూరులోని డ్వామా కార్యాలయం నుంచి సోమవారం వివిధ మండలాల అధికారులు, సిబ్బందితో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. పనులకు హాజరయ్యే శ్రామికులకు త్వరలో నగదు వారి బ్యాంక్ అకౌంట్లలో జమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విషయంపై అవగాహన కల్పించి అధిక సంఖ్యలో పనులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన నిబంధనలను వంద శాతం పాటిస్తూ పనులు కల్పించాలన్నారు. పని ప్రదేశాల నుంచి శ్రామికుల ఫొటోలు యాప్ ద్వారా అప్‌లోడ్ చేయాలని సూచించారు.
కండలేరులో
44.510 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 44.510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 400, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


