పాలిసెట్‌కు పక్కాగా ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పాలిసెట్‌కు పక్కాగా ఏర్పాట్లు

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

నెల్లూరు రూరల్‌: జిల్లాలో ఏపీ పాలిసెట్‌కు ఏర్పాట్లను పక్కాగా చేయాలని డీఆర్వో విజయ్‌కుమార్‌ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షను నెల్లూరు, ఆత్మకూరు, కావలి, గూడూరు కేంద్రాల్లో శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు ఉదయం పదింటికే చేరుకోవాలని సూచించారు. హాల్‌ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరని.. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను అనుమతించేదిలేదని చెప్పారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

పద్మ అవార్డులకు

దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు (టౌన్‌): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 26న కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేయనున్న పద్మ అవార్డులకు క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని డీఎస్డీఓ జసీమ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన క్రీడాకారులు awards. gov. inలో పొందుపర్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా తమ దరఖాస్తులను sportsinap@gmail. com లేదా incentives. schemes@gmail. comకు వచ్చే నెల 15లోపు పంపాలని కోరారు. దరఖాస్తుల కోసం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. ఈ – మెయిల్‌ ద్వారా వచ్చిన ద రఖాస్తులనే ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాఽధికార సంస్థ, విజయవాడకు పంపనున్నామని వెల్లడించారు.

29న జిల్లా స్థాయి

అండర్‌ – 13 చెస్‌ ఎంపికలు

నెల్లూరు (టౌన్‌): జిల్లా స్థాయి అండర్‌ – 13 బాలుర, బాలికల చెస్‌ చాంపియన్‌షిప్‌ ఎంపికలను ఈ నెల 29న నిర్వహించనున్నామని నెల్లూరు చెస్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మంజుల, కార్యదర్శి మస్తాన్‌బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు సమీపంలోని కలివెలపాళెంలో గల రెయిన్‌బో స్కూల్లో నిర్వహించనున్నామని చెప్పారు. 2013, జనవరి ఒకటి తర్వాత జన్మించిన వారై ఉండాలని, అర్హులు 80963 28326, 96033 45326 నంబర్లను ఈ నెల 27లోపు సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రతిభ చూపిన వారికి సైకిళ్లతో పాటు ట్రోఫీని అందజేయనున్నామని వివరించారు. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వారు రాష్ట్ర స్థాయి చెస్‌ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించనున్నారని పేర్కొన్నారు.

ధర ఉన్నా.. దిగుబడేదీ..?

కిలో నిమ్మ రూ.170

చిల్లకూరు: నిమ్మకు మంచి ధర ప్రస్తుతం లభిస్తున్నా.. దానికి తగిన విధంగా దిగుబడి లేక రైతులు దిగులు చెందుతున్నారు. ధరలు అమాంతం పెరిగినా, ఆశించిన స్థాయిలో కాయల్లేక వీరి పరిస్థితి దయనీయంగా మారింది. వాస్తవానికి గూడూరు నిమ్మ మార్కెట్‌ జిల్లాలోనే అతి పెద్దది. ఇక్కడ్నుంచి ఇతర రాష్ట్రాలకు నిత్యం పది లారీలకు తక్కువ కాకుండా ఎగుమతవుతాయి. రైళ్లు, పార్శిల్‌ వ్యాన్లలోనూ తరలిస్తుంటారు. ఢిల్లీ మార్కెట్లో ధరలు రెండు రోజుల్లో అమాంతం పెరిగాయి. దీంతో ఇక్కడి వ్యాపారులు గ్రేడింగ్‌ను బట్టి కిలో కాయలకు రూ.200 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే పెద్ద వాటి ధర రూ.170 మేర మంగళవారం పలికింది. రేట్లు బాగుండటంతో పిందెలను సైతం కోసి రైతులు తీసుకొస్తున్నారని వ్యాపారులు తెలిపారు. మేలో ధరలు తగ్గిపోతే నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొంటున్నారు. ధరలున్న టైమ్‌లో కాయలు అందుబాటులో ఉండవని.. చెట్లకు విరివిగా కాసిన సమయంలో మార్కెట్‌ రేట్లను అమాంతం తగ్గించేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement