● ఇంటి వరండాలో ఉరేసుకున్న వైనం
● సందేహాలు వ్యక్తం చేస్తున్న
తల్లిదండ్రులు
నెల్లూరు సిటీ: అనుమానాస్పద స్థితిలో ఉరేసుకొని గిరిజన బాలిక మృతి చెందిన ఘటన కాకుపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల వివరాల మేరకు.. నెల్లూరు రూరల్ మండలంలోని కాకుపల్లిలో ఓ వ్యక్తి.. లేఅవుట్‌కు వాచ్‌మెన్‌గా పనిచేస్తూ అక్కడే ఓ గదిలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. వీరికి ఐదుగురు కుమారులు, 12 ఏళ్ల కుమార్తె ఉన్నారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో బాలిక తన ముగ్గురు సోదరులతో కలిసి స్కూల్‌కెళ్లింది. ఈ తరుణంలో కూలీ పనుల నిమిత్తం నెల్లూరెళ్లే క్రమంలో వీరిని పాఠశాల నుంచి తల్లిదండ్రులు తీసుకొచ్చారు. ఆపై ఇంటి వరండాలో చీరతో ఉరేసుకొని బాలిక మధ్యాహ్నం కనిపించింది. ఈ విషయమై స్థానికులకు బాలిక సోదరులు తెలియజేయగా, వారొచ్చి చూడగా అపస్మారక స్థితిలో వేలాడుతూ కనిపించింది. తండ్రికి ఫోన్ చేయగా, వెంటనే వచ్చి కాకుపల్లిలోని ఓ ఆర్‌ఎంపీని తీసుకొచ్చారు. అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు.
అనుమానాలు..
ఇంటి ముందు ముగ్గురు వ్యక్తులు వెళ్తూ.. అటుగా తిరిగారని పోలీసులకు పిల్లలు చెప్పారు. తాము సమీపంలో ఆడుకుంటున్నామని, ఇంటి నుంచి సోదరి ఎంతసేపటికీ రాకపోవడంతో వెళ్లి చూడగా ఉరేసుకొని కనిపించిందన్నారు. ఘటనపై నెల్లూరు రూరల్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతి కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలానికి రూరల్ సీఐ వేణు, కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి చేరుకొని విచారణ జరిపారు. అనంతరం ఫొరెన్సిక్, నెల్లూరు క్లూస్‌టీమ్ చేరుకొని ఆధారాలు, వివరాలను సేకరించారు.


