దుత్తలూరు: స్థానిక కమ్మవారిపాళెం సొసైటీలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఏర్పాటు చేయనున్నామని టెక్నికల్ ఏఓ సుబ్బారెడ్డి, మండల వ్యవసాయాధికారి మదన్‌మోహన్ తెలిపారు. జొన్న రైతుల కష్టాలపై ’జొన్నకు ధర దన్నేదీ..?’ అనే శీర్షికన సాక్షిలో కథనం మంగళవారం ప్రచురితమైంది. ఈ తరుణంలో స్పందించిన అధికారులు.. జొన్న రైతులతో సమావేశాన్ని సొసైటీ ఆవరణలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడారు. ఎవరూ ఆందోళన చెందొద్దని, కేంద్రాన్ని ఏర్పాటు చేసి క్వింటాను రూ.3699 చొప్పున కొనుగోలు చేయనున్నామని వివరించారు. విక్రయానికి తెచ్చే జొన్నల తేమ శాతం 13గా ఉండాలని, దుమ్ము, ధూళి లేకుండా, రంగు మారకుండా ఉన్న వాటిని కొను గోలు చేయనున్నామని వెల్లడించారు. గోనె సంచులు ప్రస్తుతం లేవని, రైతులే సమకూర్చుకోవాల ని కోరారు. దుత్తలూరు మండలంలోని 364 ఎకరాల్లో జొన్న పంటను ఈ – క్రాప్‌లో నమోదు చేశారని, వీరి నుంచి కొనుగోలు చేయనున్నామని ప్రకటించారు. సొసైటీ సీఈఓ లోకనాథ్‌రెడ్డి, వీఏఎలు దినేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


