అన్నదాతలను చంద్రబాబు ప్రభుత్వం దళారుల దోపిడీకి వదిలేసింది. యూరియా సరఫరా చేయమని అడిగితే.. సీఎం చంద్రబాబు మాత్రం వరి అన్నం తింటే రోగాలు వస్తున్నాయంటున్నారు. ధాన్యానికి కనీసం మద్దతు కల్పించమని అడిగితే.. వరి బియ్యం ఎవరూ తినడం లేదు.. మార్కెట్లో డిమాండ్ లేదని, అందుకే కొనేవాడు లేడని, మేము కొని ఏం చేయమంటారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రశ్నిస్తారు. వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలు సాగు చేసినా.. ధరలు కల్పించడంలో నిర్లక్ష్యం చూపుతున్న పాలకులు, కొనుగోలు కేంద్రాలు పెట్టి కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవంటూ సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయడు చెబుతున్నారు.
ఉదయగిరి/దుత్తలూరు: చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం జొన్న రైతుల పాలిట శాపంగా మారింది. జొన్న పంట సాగు చేస్తే వచ్చిన దిగుబడులను తామే కొనుగోలు చేస్తామని నమ్మబలికి ఇప్పుడు నోరు మెదపకపోగా, ప్రభుత్వం కొనడానికి డబ్బుల్లేవంటూ సాక్షాత్తు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం రైతులను కలవర పెడుతోంది. జిల్లాలో పంట రైతుల చేతికి వచ్చి రెండు నెలలు గడిచినా ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. దీంతో జొన్న సాగు చేసిన రైతులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడం దేవుడెరుగు.. ప్రభుత్వ పాలకులు ఏ గాలికి ఆ గాలి మాటలు మాట్లాడున్నారు. తమ అసమర్థ పాలనతో రైతుల కష్టాన్ని దళారులకు, వ్యాపారులకు, మిల్లర్లకు దోచిపెడుతున్నారు. పంటల సాగు సమయంలో యూరియా, ఎరువులు అడిగితే సరఫరా చేయలేని అసమర్థులు యూరియా వాడితే రోగాలు వస్తున్నాయని అన్నదాతల చెవుల్లో పూలు పెడుతున్నారు. పండించిన పంటలకు మద్దతు ధర కల్పించమని అడిగితే.. కొనేవాడు లేడంటూ తప్పించుకుంటారు. ప్రభుత్వమైన కొనమంటే డబ్బుల్లేవని తెగేసి చెబుతున్నారు. ఏ పంట సాగు చేసిన రైతులైనా ఇదే పరిస్థితి.
అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా దళారులు, దోపిడీదారులు ఉన్నప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారికి చెక్ పెడుతూ తీసుకున్న నిర్ణయాలు అన్నదాతలను ఆదుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టి.. పంట పండినప్పుడు ధరల్లేని సమయంలో మార్క్ ఫెడ్ ద్వారా, ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేసి రైతులను కనీసం మద్దతు ధరలు కల్పించారు. గత ప్రభుత్వానికి సాధ్యమైన ఈ ప్రణాళికను అమలు చేస్తే కనీసం మద్దతు ధరలు దక్కేవని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.
3158 ఎకరాల్లో జొన్న సాగు..
జిల్లాలో టీపీగూడూరు, సీతారామపురం, ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, మర్రిపాడు, కొండాపురం, ఎస్‌పేట, పొదలకూరు, చేజర్ల, కలువాయి మండలాల్లో రబీ సీజన్‌లో 3158 ఎకరాల్లో హైబ్రీడ్ జొన్న సాగు చేశారు. మార్చి మొదటి వారానికి అంతా కోతలు పూర్తయ్యాయి. పంట రైతుల చేతికి అందికి వచ్చి దాదాపు నెల రోజులు పూర్తయింది. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం దిగుబడిన అయిన జొన్నలు 63 వేల కింటాళ్లు రైతుల దగ్గర నిల్వలు ఉన్నాయి. మెట్ట ప్రాంతాల్లో వ్యవసాయ అధికారులు రైతులను మెప్పించి హైబ్రీడ్, మాలదండి రకాల జొన్న సాగు చేయించారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రూ.3,649 నుంచి రూ.3,749 కొనుగోలు చేస్తామని తెలిపారు. కానీ తీరా పంట చేతికి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
కొనుగోలు కేంద్రాలు ఎక్కడ?
ప్రస్తుతం జొన్నలు క్వింటాలకు బహిరంగ మార్కెట్‌లో ధర రూ.2 వేల నుంచి రూ.2,200 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఎకరానికి సగటున రూ.15 నుంచి 20 క్వింటాలు దిగుబడి వచ్చింది. ఎకరానికి సాగు బడి ఖర్చులు రూ.25 వేలు వరకు అవుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం విక్రయిస్తే పెట్టుబడి మాత్రమే వచ్చే అవకాశం ఉంది. మరి రైతు కష్టం వృథానే అవుతుంది. అదే ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తే ఎకరానికి రూ.20 వేలు వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇంతవరకు జొన్న కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. రైతులు అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. దీంతో ఇప్పుటికే కొంత మంది రైతులు సాగు పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు వారి బాధ తట్టుకోలేక రూ.2 వేలకే తెగనమ్మి నష్టపోయారు. స్టాక్ ఉంచిన రైతులకై నా న్యాయం జరగాలంటే ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలి. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన సివిల్ సప్లయీస్ అధికారులు పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొనే వారు లేక
రైతు విలవిల
పంట చేతికి వచ్చి 2 నెలలు
ఇంకా ప్రారంభం కాని కొనుగోలు కేంద్రాలు
క్వింటా కనీస మద్దతు ధర రూ.3,749
దళారులు కొనే ధర రూ.రెండు వేలు
ఇటీవల సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటనలో బోగస్ రైతుతో సంభాషణ
ఎకరానికి రూ.50 వేల లాభం
వచ్చిందని డప్పు
ఈ ఏడాది ఎకరానికి
20 క్వింటాళ్ల లోపే దిగుబడి
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
జొన్న సాగు ఖర్చు రూ.25 వేలు అవుతోంది. ఈ ఏడాది ఎకరం 15 నుంచి 20 క్వింటాల మధ్య దిగుబడి వచ్చింది. పంటను తామే ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పారు. కానీ పంట చేతికి వచ్చి రెండు నెలలు అయినా ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. కొంతమంది క్వింటా రూ.2 వేలకే వ్యాపారులకు అమ్ముకుని నష్టపోయారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి.
– గువ్వల సుబ్బారెడ్డి, దుత్తలూరు
ఇటీవల వింజమూరు పర్యటనకు వచ్చిన సందర్భంగా సీఎం వ్యవసాయ స్టాల్‌ను పరిశీలించారు. ఆ స్టాల్‌లో ఉన్న ఆదర్శ రైతు తాను జొన్న పంట సాగు చేసి ఎకరానికి రూ.50 వేలు లాభం చేశాను అని చెప్పడంపై పలువురు జొన్న సాగు రైతులు విస్మయం వ్యక్తం చేశారు. ఎకరానికి 25 క్వింటాలు దిగుబడి వచ్చినా ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.50 వేలు వస్తోంది. ఖర్చు రూ.25 వేలు పోతే.. మరి రూ.50 వేలు ఎలా లాభం వస్తుందని రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సీఎంను సంతృప్తి పరిచేందుకు ఇలా చెప్పారే తప్ప.. వాస్తవ పరిస్థితులు సీఎం దృష్టికి తీసుకేళ్లే ప్రయత్నం జరగలేదని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎంతో మాట్లాడిన రైతు అసలు జొన్న సాగే చేయలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.


