కార్పొరేషన్లో టీడీపీ దోపిడీ పర్వం | - | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్లో టీడీపీ దోపిడీ పర్వం

Apr 21 2026 3:50 AM | Updated on Apr 21 2026 3:50 AM

నెల్లూరు రూరల్‌: రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో నగరంలో మొక్కలు, స్కూళ్ల పేరుతో దోపిడీకి టీడీపీ నేతలు తెరలేపుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో సోమవారం వారు మాట్లాడారు. ఒక్కో మొక్క నాటేందుకు రూ.ఐదు వేలు, దాని నిర్వహణకు రూ.12 వేలను కార్పొరేషన్‌ నిధుల నుంచి వెచ్చిస్తున్నారంటూ తాము ఆధారాలతో సహా ప్రశ్నిస్తే, సీఎస్సార్‌ నిధులంటున్నారని తెలిపారు. వీఆర్‌ హైస్కూల్‌ అభివృద్ధి విషయంలోనూ ఇలానే ఖర్చు పెట్టేందుకు యత్నిస్తే, తాము అడ్డుకున్నామని గుర్తుచేశారు.

వ్యక్తిగత విమర్శలతో..

నెల్లూరు కార్పొరేషన్లో జరుగుతున్న దోపిడీ.. మంత్రి నారాయణ నేతృత్వంలో ప్రజల సొమ్మును తెలుగు తమ్ముళ్లు ఎలా దోచుకుంటున్నారనే విషయాన్ని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బయటపెట్టారని, అప్పటి నుంచి ఎవరెవర్నో ఉసిగొల్పి తమపై వ్యక్తిగత విమర్శలు చేయిస్తూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలతో సహా ఆయన మాట్లాడారని, అయితే టీడీపీ నేతలు సవాళ్లు చేస్తున్నారని విమర్శించారు. వీరి ప్రతి మాటకూ సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

నిధులు కొట్టేసేందుకు కుట్ర

నగరంలోని 11, 13వ డివిజన్లలో వెయ్యి మొక్కలకు గానూ రూ.50 లక్షల చొప్పున వర్క్‌ ఆర్డర్‌ను ఇచ్చారని, అంటే ఒక్కో మొక్కకు రూ.ఐదు వేలానని ప్రశ్నించారు. 14వ డివిజన్లో 1800 మొక్కలకు రూ.1.24 కోట్లతో వర్క్‌ ఆర్డర్‌ను రూపొందించారని, దీని మేరకు ఒక్కో దాని నిర్వహణకు రూ.12 వేలను ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలా నగరపాలక సంస్థ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రశ్నిస్తే సొంత నిధులు, సీఎస్సార్‌ ఫండ్స్‌ అంటూ బుకాయిస్తున్నారని చెప్పారు.

మాది అసత్య ప్రచారం కాదు..

ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్న నిధులపై పర్వతరెడ్డి ప్రశ్నించడంతోనే మీ దోపిడీ బయటపడిందని, ఈ క్రమంలోనే సొంత నిధులను ఖర్చు పెడుతున్నామంటున్నారని చెప్పారు. కమిషనర్‌కు దీంతో ఏమి సంబంధమని ప్రశ్నించారు. డొంక తిరుగుడు సమాధానాలివ్వడం, తీర్మానాలను ఆమోదించుకోవడం, అడిగితే ఎదురుదాడి చేయడం వీరికి పరిపాటిగా మారిందని విమర్శించారు. మొక్కలను దొంగలించిన వారిపై చర్యలు చేపట్టాలని మంత్రి చెప్తున్నారని, మరో వ్యక్తి ప్రెస్‌మీట్‌ పెట్టి ఫొటోలు చూపి మొక్కలు తీసేశారనే ఆరోపణలు చేశారని తెలిపారు. తమ పార్టీకి అంత దిగజారాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

సీఎస్సార్‌ నిధుల విడుదల్లో ఓ ప్రక్రియ

సీఎస్సార్‌ నిధుల విడుదల్లోనూ ఓ ప్రక్రియ ఉంటుందని, కంపెనీలు ఇష్టారాజ్యంగా వీటిని ఇవ్వకూడదని చెప్పారు. ఇటీవలి కాలంలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఇలాగే నిబంధనలకు విరుద్ధంగా మారిటైమ్‌ బోర్డు నిధులను అడుగుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నేలటూరు ఫిషింగ్‌ జెట్టీ కోసం రూ.25 కోట్ల నిధులివ్వాలని కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని కోరామని, అన్ని అనుమతులను ఇప్పించామని, డ్రెడ్జింగ్‌ మినహా మిగిలినవి పూర్తయ్యాయని చెప్పారు. తాజాగా మిగిలిన వర్కుల కోసం మారిటైమ్‌ నిధులను అడుగుతున్నారంటే, అది అవినీతి కోసమేనని ఆరోపించారు. పన్నులు.. సీఎస్సార్‌ నిధులపై పారదర్శకంగా వివరాలను బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మొక్కకు రూ.12 వేలంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు.

మొక్కలు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి

అడిగితే సమాధానం చెప్పలేక

బెదిరింపులు

వీఆర్‌ హైస్కూల్‌ విషయంలోనూ ఇదే తీరు

ధ్వజమెత్తిన కాకాణి, పర్వతరెడ్డి

దోపిడీకి విఫలయత్నం

నగరంలో మొక్కలు నాటడాన్ని చూసి ఓర్వలేక కడుపు మండి మాట్లాడుతున్నామంటూ నారాయణ వంటి వ్యక్తి వ్యాఖ్యానించడం బాధ కలిగిస్తోందని పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. పన్నుల రూపంలో వసూలు చేసిన నిధులను ఇలా ఇష్టారాజ్యంగా పంచి పెడతామంటే ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. నగరంలో 14,800 మొక్కలను నాటుతున్నామని, దీనికి రూ.8.2 కోట్ల ఖర్చవుతుందని నారాయణ చెప్పారని, దీని ద్వారా ఒక్కో దానికి రూ.రూ.5540 అవుతోందని వివరించారు. అనుమతి పొందింది రూ.ఐదు వేలకై తే.. టీడీపీ నేతలేమో రూ.3700 అంటున్నారని.. మంత్రి మాత్రం రూ.5540 వ్యయం అవుతుందంటున్నారని చెప్పారు. నారాయణ ఓఎస్డీ.. వాట్సాప్‌ గ్రూపుల్లో 10 వేల మొక్కలకు రూ.ఐదు కోట్లని మెసేజ్‌లు పంపారని.. చెప్పేది అబద్ధం కాబట్టే ఒక్కో చోట ఒక్కో లెక్క చెప్తున్నారని విమర్శించారు. కమిషనర్‌ మరో లెక్క చెప్తున్నారని, ఇదంతా మోసం కాదానని ప్రశ్నించారు. నగరంలో వీఆర్‌ హైస్కూల్‌ ఆధునికీకరణ కోసం రూ.15 కోట్ల సీఎస్సార్‌ నిధులను తెచ్చి పూర్తి చేస్తామని మంత్రి నారాయణ గతంలో చెప్పారని, దీన్ని నగరపాలక సంస్థ పరిధిలోకి తీసుకొచ్చి గుదిబండలా మార్చారని ఆరోపించారు. దీని అభివృద్ధి కోసం రూ.ఐదు కోట్లు అవసరమని కమిషనర్‌, మేయర్‌ సంతకాలు చేసి అనుమతులిచ్చారని.. వాహనాల కోసం మరో రూ.ఐదు కోట్లు కావాలన్నారని పేర్కొన్నారు. ఒక్కో వ్యాన్‌ రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షలకు వస్తుంటే, రూ.50 లక్షల బడ్జెట్‌ పెట్టారని విమర్శించారు. సీఎస్సార్‌ నిధులంటూ కార్పొరేషన్‌ నుంచి రూ.10 కోట్లు తీసుకునేందుకు కుట్ర పన్నారని, తాము ప్రశ్నిస్తే నారాయణ యూటర్న్‌ తీసుకున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement