నెల్లూరు (టౌన్): రానున్న విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని డీఈఓ బాలాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులను వసూలు చేస్తే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. పాఠ్య పుస్తకాలు, యూనిఫారం, నోట్ పుస్తకాలు, స్టేషనరీలను స్కూళ్లలో విక్రయించకూడదని స్పష్టం చేశారు. ఒలంపియాడ్, ఇంటర్నేషనల్, టెక్నో, ఈ – టెక్నో, మెడికల్ లాంటి పేర్లు పెట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు.
చలివేంద్రాలను విరివిగా
ఏర్పాటు చేయండి
నెల్లూరు రూరల్: ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు గానూ జిల్లా వ్యాప్తంగా చలివేంద్రాలను విరివిగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంఘాలు వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. జూన్ 30 వరకు లేదా వడగాలుల తీవ్రత తగ్గేంత వరకు నిరంతరంగా నిర్వహించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో నెలకొల్పాలని చెప్పారు. నిబంధనల మేరకు అత్యుత్తమంగా నిర్వహించే సంస్థలకు తన తరఫున ప్రశంస పత్రాలు, నగదు బహుమతులను అందజేయనున్నామని ప్రకటించారు.
డయల్ యువర్ ఎస్‌ఈకి
మూడు ఫిర్యాదులు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని విద్యుత్ భవన్‌లో డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ రాఘవేంద్రం దృష్టికి తమ సమస్యలను ముగ్గురు తెలియజేశారు. లో ఓల్టేజీ.. గృహ విద్యుత్ సర్వీస్‌కు టైటిల్ ట్రాన్స్‌ఫర్.. నూతన వ్యవసాయ సర్వీస్ ఏర్పాటు అంశాలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వీటిని సత్వరమే పరిష్కరించనున్నామని ఆయన వివరించారు. ఈఈ శేషాద్రిబాలచంద్ర, ఏఈలు నరసింహరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఎట్టకేలకు.. హుండీ
కానుకల లెక్కింపు
అనుమసముద్రంపేట: ఏఎస్‌పేటలోని పవిత్ర పు ణ్యక్షేత్రమైన హజరత్ ఖాజారసూల్ దర్గాలో హుండీ కానుకల లెక్కింపును సోమవారం ప్రారంభించారు. దాదాపు 27 నెలలుగా లెక్కింపు జరగలేదు. తాజాగా వక్ఫ్‌బోర్డు అధికారులు అను మతులివ్వడంతో ప్రక్రియను ప్రారంభించారు. దర్గాలో దాదాపు 20 హుండీలున్నాయని, సీసీ కెమెరాల నీడన దాదాపు పది రోజుల పాటు సిబ్బంది లెక్కించనున్నారని ఈఓ హుస్సేన్ తెలిపారు. కాగా తనకు చెందిన హుండీలున్నాయంటూ హైకోర్టును మాజీ ముతవలీ గతంలో ఆశ్రయించడంతో లెక్కింపునకు కోర్టు నిరాకరించింది. ఈ క్రమంలో వక్ఫ్ బోర్డు అధికారులు గట్టిగా యత్నించి కోర్టు నుంచి అనుమతులు పొందడంతో హుండీ కానుకల లెక్కింపు ప్రారంభమైంది. మొదటి హుండీ లెక్కింపు ద్వారా రూ.18,83, 570.. 15.4 గ్రాముల బంగారం, 814 గ్రాముల వెండి లభించిందని ఈఓ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
ఆరు గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సోమవారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని ఎనిమిది కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారిని 76,406 మంది ఆదివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 28,463 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.3.45 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.


