దండకాల దంగల్‌ | - | Sakshi
Sakshi News home page

దండకాల దంగల్‌

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

కోవూరు: అంగన్‌వాడీ కేంద్రాల్లోని పిల్లలు, తల్లుల ఆరోగ్యం కోసం కేటాయించిన నిధుల్లో వాటాల కోసం ఇందుకూరుపేట ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లో కక్కుర్తి పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్న సీడీపీఓను సైడ్‌ ట్రాక్‌ చేసి.. ఆమెకు తెలియకుండానే ఆమె పేరును అడ్డం పెట్టుకొని ఆ కింది స్థాయి అధికారిణి అక్రమ వసూళ్లకు తెరలేపడం చర్చనీయాంశంగా మారింది.

మనం పంపాల్సిందే..

ఈ ప్రాజెక్ట్‌లో సర్వం తానై వ్యవహరిస్తున్న ఓ అధికారిణి అంగన్‌వాడీ వర్కర్లను పిలిపించి మేడమ్‌ (సీడీపీఓ) అడుగుతున్నారు.. మనం పంపాల్సిందేనంటూ వర్కర్ల నుంచి డబ్బులు గుంజుతున్నారని సమాచారం. వాస్తవానికి ఈ వ్యవహారంలో సీడీపీఓకు ఎటు వంటి సంబంధం లేదని తెలిసిన అంగన్‌వాడీ వర్కర్లు.. సదరు కింది స్థాయి అధికారిణి ఆదేశాలతో ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు పొక్కడంతో సదరు శాఖ ఉన్నతాధికారిణి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ ప్రకటన విడుదల చేయడం తెలిసిందే.

పీడీ, సీడీపీఓ మధ్య గ్యాప్‌.. ఆమెకు వరం

ఐసీడీఎస్‌ పీడీ, ఇందుకూరుపేట సీడీపీఓ మధ్య గ్యాప్‌ ఉన్నట్లు సమాచారం. గ్యాప్‌ను సదరు కింది స్థాయి అధికారిణి తనకు అనుకూలంగా మార్చు కున్నారు. ఈ క్రమంలో సీడీపీఓను సైడ్‌ ట్రాక్‌ చేసి, ఆమె కింది స్థాయి అధికారిణికి పెత్తనం ఇవ్వడంతో ఆమె సర్వం తానై వసూళ్ల వ్యవహారాన్ని చక్కబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దల ఆశీస్సులు తనకున్నాయని అంగన్‌వాడీ వర్కర్ల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తు తున్నాయి. మాట వినని వారిని మానసికంగా వేధించడం, షోకాజ్‌ నోటీసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం పరిపాటిగా మారిందని పోతున్నారు.

గుట్టురట్టవడంతో ఆందోళన

సీడీపీఓ పేరుతో ఇప్పటివరకు సాగుతున్న ఈ వసూళ్ల దందా ఇటీవల బయటపడింది. ఇందుకు సంబంధించి ప్రాజెక్ట్‌లోని కింది స్థాయి అధికారిణి ఆడియో, వీడియోలు ఉండడం, ఈ వ్యవహారంపై కలెక్టర్‌కు విచారణకు ఆదేశించడంతో సదరు అధికారిణి ఆందోళనకు గురవుతున్నారని తెలుస్తోంది. సీడీపీఓ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్న అధికారిణి వెనుక ఉన్న పెద్దలెవరో బయటపడే అవకాశం ఉందని అంగన్‌వాడీ వర్కర్లు అంటున్నారు.

సీడీపీఓ పేరుతో కింది స్థాయి

అధికారిణి వసూళ్ల పర్వం

లబోదిబోమంటున్న అంగన్‌వాడీ వర్కర్లు

ఐసీడీఎస్‌ ఉన్నతాధికారి అండతో చెలరేగిపోతున్న ప్రాజెక్ట్‌ అధికారిణి

బట్టబయలు కావడంతో తమకేమీ తెలియదని ప్రకటన

Advertisement
 
Advertisement
Advertisement