● డ్రంక్ అండ్ డ్రైవ్,
బహిరంగ మద్య సేవనంపై 69 కేసులు
నెల్లూరు(క్రైమ్): శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ చర్యల్లో భాగంగా శనివారం రాత్రి నుంచి అర్ధరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నాకాబందీ నిర్వహించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, శివారు ప్రాంతాలు, జాతీయ రహదారి ప్రవేశ–నిష్క్రమణ ప్రాంతాల్లో వాహన తనిఖీలు జరిపారు. వాహనదారులకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేశారు. మద్యం మత్తులో వాహనం నడుపుతున్న వారిపై 30 కేసులు నమోదు చేశారు. నిబంధనల ఉల్లంఘనులపై 227 కేసులు నమోదు చేసి రూ.1,25,040 జరిమానా విధించారు. బహిరంగ మద్య సేవనంపై 39 కేసులు నమోదు చేశారు. మందుబాబులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. క్రికెట్ బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాల కట్టడిలో భాగంగా జిల్లాలోని లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేశారు. లాడ్జీల్లో బసచేసిన వారి వివరాలను సేకరించారు. రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తిస్తే డయల్ 112కు లేదా పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. లాడ్జీలో బసచేసే వారి వివరాలను ప్రతిరోజు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అందజేయాలని చెప్పారు. నేర నియంత్రణకు తాము తీసుకుంటున్న చర్యలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తమ ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల కదలికలు, చీకటి కార్యకలాపాలు, నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు తదితరాలు గుర్తిస్తే తెలియజేయాలని కోరారు. నాకాబందీలో జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


