ఉప్పు కాలువలో గుర్తుతెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

ఉప్పు కాలువలో గుర్తుతెలియని మృతదేహం

Apr 20 2026 7:24 AM | Updated on Apr 20 2026 7:24 AM

తోటపల్లిగూడూరు (పొదలకూరు): మండలంలోని కొత్త పట్టపుపాళెం వద్దను న్న ఉప్పు కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వీరేంద్రబాబు మాట్లాడుతూ సుమారు 40 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి ఉప్పు కాలువలో పడి మృతిచెంది ఉన్నాడని, అతని ఎడమ చేతి మీద గిరిజ అని పచ్చబొట్టు ఉన్నట్లు తెలిపారు. గోధుమ రంగుపై బ్లూ, పింక్‌ కలర్‌ ఫ్లవర్‌ డిజైన్‌ ఉన్న ఫుల్‌షర్ట్‌, తెల్లటి బనియన్‌, నల్లని నైట్‌ ఫ్యాంట్‌ వేసుకొని ఉన్నాడని వెల్లడించారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం అందజేయాల్సిందిగా కోరారు.

జనావాసాల్లోకి

చుక్కల దుప్పి

ఉదయగిరి రూరల్‌: దాహం తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి ఓ చుక్కల దుప్పి మండలంలోని తిరుమలాపురం పంచాయతీ గుడినరవ గ్రామంలోకి వచ్చిన ఘటన ఆదివారం ఉదయం జరిగింది. ఈ క్రమంలో దుప్పిని వీధి కుక్కలు గమనించి దాడి చేసేందుకు వెంబడించాయి. దీంతో గ్రామస్తులు గమనించి కుక్కల బారి నుంచి చుక్కల దుప్పిని రక్షించి దాహార్తిని తీర్చారు. అనంతరం ఉదయగిరి అటవీ రేంజ్‌ అధికారి బీఎస్‌ కుమార్‌ రాజాకు సమాచారం అందించారు. ఆయన ఆదేశాల మేరకు ఎఫ్‌బీఓ అఫ్జల్‌, సిబ్బంది గ్రామానికి చేరుకుని చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకొని గన్నేపల్లి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

వీఆర్వోకు బెదిరింపులు..

చీటింగ్‌ కేసు నమోదు

సోమశిల: అనంతసాగరం మండలంలో పనిచేస్తున్న మహిళా వీఆర్వో రాజేశ్వరి ఫిర్యాదు మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేశామని ఎస్సై సూర్యప్రకాష్‌రెడ్డి ఆదివారం తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలో వీఆర్వోగా పనిచేస్తున్న రాజేశ్వరికి గత ఆదివారం ఓ వ్యక్తి ఫోన్‌ చేసి ఏసీబీ డీఎస్పీ అంటూ బెదిరింపులకు గురిచేయడంతో ఆమె బయపడి లక్ష రూపాయలను ఫోన్‌పే ద్వారా అతని నంబర్‌కు పంపింది. అనంతరం అతనికి కాల్‌ చేయగా ఫోన్‌ కలవకపోవడంతో మోసపోయానని తెలుసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

అప్పు చెల్లించాలని

అడిగినందుకు దాడి

ఉదయగిరి: తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని అడిగినందుకు పట్టణంలోని మంగలికట్టకు చెందిన అగర శేషమ్మపై ఇద్దరు దాడి చేసినట్లు ఫిర్యాదు అందినట్లు ఎస్సై కర్నాటి ఇందసేనారెడ్డి ఆదివారం తెలిపారు. పోలీసులు, బాధితురాలి వివరాల మేరకు.. మస్తానమ్మ అనే మహిళకు శేషమ్మ కొంత నగదు అప్పుగా ఇచ్చింది. ఆ అప్పు తీర్చమని అడిగేందుకు వెళ్లగా మస్తానమ్మ, ఆమె భర్త తిరుపతయ్య తనపై దాడి చేసి దుర్భాషలాడినట్లు శేషమ్మ పోలీసుల కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement