ఐసీడీఎస్‌లో రాబందులు | - | Sakshi
Sakshi News home page

ఐసీడీఎస్‌లో రాబందులు

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

కమీషన్లు ఇవ్వాలని హుకుం

ప్రశ్నిస్తే వేధింపులు

డబ్బులు కొల్లగొట్టేందుకు స్కెచ్‌

కోవూరు: అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా రెండుసార్లు నిర్వహించే సీబీ సమావేశాలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. ఇది ఖాతాల్లో పడటమే ఆలస్యం, దానిపై జిల్లా స్థాయిలోని ఓ అధికారి కన్ను పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీడీ ఆదేశాలంటూ అబద్ధపు ప్రచారంతో రంగంలోకి దిగారు. దీనికి గానూ సూపర్‌వైజర్లతో సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ఒక్కో కేంద్రం నుంచి రూ.600 చొప్పున వసూలు చేయాలని హుకుం జారీ చేయడం గమనార్హం. ఐసీడీఎస్‌ ఇందుకూరుపేట ప్రాజెక్టులో ఇటీవలి కాలంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది.

టార్గెట్‌ రూ.16 లక్షలు

జిల్లా వ్యాప్తంగా 12 సెక్టార్లకు గానూ దాదాపు 6500 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. జిల్లాలోని 2672 కేంద్రాల్లో సీబీ ఈవెంట్లను ప్రతి నెలా రెండు చొప్పున ఏటా 20 సార్లు నిర్వహించాల్సి ఉంటుంది. దీనికి గానూ నెలకు రూ.500 చొప్పున ఏటా రూ.పది వేలను జమ చేయనున్నారు. ఈ తరుణంలో ఒక్కో కేంద్రం నుంచి రూ.600 చొప్పున సుమారు రూ.16 లక్షలను దండుకోవాలనే ప్రణాళికను రూపొందించారు. ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు వంటి ప్రాంతాల్లో ఇప్పటికే వసూళ్ల పర్వం మొదలైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. వర్కర్లకు సూపర్‌వైజర్లు నేరుగా ఫోన్‌ చేసి.. ‘మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి.. అందులో జిల్లా మేడమ్‌ వాటాను వెంటనే పంపండంటూ వేధింపులకు దిగుతున్నారనే టాక్‌ నడుస్తోంది. కింది స్థాయిలోని ఓ అధికారి ఇలా అక్రమ వసూళ్లకు తెరలేపారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విషయం పీడీ దృష్టికి వెళ్లడంతో ఆమె ఒక్కసారిగా కంగుతిన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా డబ్బులడిగితే నమ్మకండి.. పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎవరైనా వేధిస్తే నేరుగా ఫిర్యాదు చేయండి.. బాధ్యులపై కఠిన చర్యలు చేపడతానంటూ సెక్టార్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో మెసేజ్‌ పెట్టారు.

సాక్ష్యాలున్నా..చర్యలేవీ..?

డబ్బులను ఎందుకు వసూలు చేస్తున్నారు.. ఎవరికివ్వాలని ప్రశ్నించిన వారిపై అంతర్గత వేధింపులు ప్రారంభమయ్యాయని సమాచారం. కలెక్టర్‌ ప్రత్యే క విచారణ జరిపించి, అక్రమ దందాను అడ్డుకోవాలని బాధితులు కోరుతున్నారు. కాగా ఈ విష యమై ఇందుకూరుపేట ఐసీడీఎస్‌ సీడీపీఓ లక్ష్మీప్రియను సంప్రదించగా, డబ్బులను వసూలు చేయా లని ఎవరికీ చెప్పలేదని, ఈ పని ఎవరు చేయించారో త్వరలో తెలుస్తుందని బదులిచ్చారు.

ఐసీడీఎస్‌ సెక్టార్లు – 12

అంగన్‌వాడీ కేంద్రాలు – 2672

కార్యకర్తలు – దాదాపు 6500 మంది

జిల్లాలో ఇలా..

గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించి వారిని సంరక్షించే అంగన్‌వాడీ కేంద్రాలపై కొందరు రాబందుల్లా వాలారు. ప్రభుత్వమిచ్చే అరకొర నిధుల్లోనూ తమకు వాటా కావాలంటూ బరితెగించారు. జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ దందా అటు అంగన్‌వాడీ వర్కర్లు, ఇటు అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లో వర్గపోరు కొనసాగుతుండగా, కార్యకర్తల నుంచి ఎవరెక్కువ మొత్తంలో వసూలు చేస్తారో వారినే అందలమెక్కిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నాకెలాంటి సంబంధం లేదు

ఇందుకూరుపేట ప్రాజెక్ట్‌ పరిధిలో నాపై రెండు రోజులుగా జరుగుతున్న అసత్యప్రచారాన్ని నమ్మొద్దు. నేనెవర్నీ డబ్బులడగలేదు. కొందరు పనిగట్టుకొని బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను తయారు చేసి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్నాను. ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు.. కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని మాత్రమే సూచిస్తుంటా. ఇలాంటి మెసేజ్‌లను వక్రీకరించి సోషల్‌ మీడియాలో పెట్టడం సరికాదు.

– హేనాసుజన్‌, పీడీ, ఐసీడీఎస్‌

Advertisement
 
Advertisement
Advertisement