● మోసగించడంలో చంద్రబాబు దిట్ట
● తీవ్రంగా నష్టపోతున్న రైతులు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
తోటపల్లిగూడూరు(పొదలకూరు): అధైర్యపడకండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. మరో మూడేళ్లు ఓపిక పడితే రైతులకు మంచి రోజులొస్తాయని.. మోసగించడంలో సీఎం చంద్రబాబు దిట్టని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మాచర్లవారిపాళెం, కొత్తపాళెం గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. ఏ హామీనీ కూటమి ప్రభుత్వం అమలు చేయడంలేదని గ్రామస్తులు తెలిపారు. ధాన్యానికి గిట్టుబాటు ధరలు లభించడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకాణి మాట్లాడారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా గత ప్రభుత్వ హయాంలో నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భావించారని తెలిపారు. గ్రామాల్లో నిర్మించిన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు ప్రస్తుతం నిరాదరణకు గురై కళావిహీనంగా మారాయని ఆరోపించారు. గ్రామస్థాయిలో పాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తమ పార్టీ అధినేత ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. ఆయనకు మంచి పేరొస్తుందనే దురుద్దేశంతో సచివాలయ వ్యవస్థను చంద్రబాబు నీరుగార్చారని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 22 నెలలు గడుస్తున్నా, కొత్త పింఛన్లను నేటికీ అందజేయడంలేదని మండిపడ్డారు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అన్నదాతలు అప్పులపాలవుతున్నారని తెలిపారు.
ఆక్వా రైతులకు అన్యాయం
ఆక్వా సాగు చేస్తున్న రైతులను గత ప్రభుత్వ హయాంలో ఆక్వా జోన్‌లో చేర్చి యూనిట్‌కు రూ.1.5 రాయితీని కల్పించి నాణ్యమైన విద్యుత్‌ను అందజేశామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వమొచ్చాక వీరిలో కొందరికే రాయితీని కల్పిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతల మాటలు విని అధికారులు, పోలీసులు తమ పార్టీ శ్రేణులకు ద్రోహాన్ని తలపెడితే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోకతప్పదని స్పష్టం చేశారు. విచారణను అధికారులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మాచర్లవారిపాళెంలో ఇటీవల మృతి చెందిన తూపిలి సుశీలమ్మ కుటుంబసభ్యులు.. కొత్తపాళెంలో అలుపూరు పెంచలయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు. పార్టీ నేత చిల్లకూరు సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


