● రోడ్ల ధ్వంసంతో భారీ వాహనాలను అడ్డుకున్న ఏరూరు గ్రామస్తులు
● స్పష్టమైన హామీ వచ్చేవరకు తగ్గేది లేదు
చిల్లకూరు: రహదారుల అభివృద్ధి పేరుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో పాత రోడ్డు పూర్తిగా ధ్వంసమై దుమ్ము, ధూళితో అల్లాడిపోతున్నామని ఏరూరు గ్రామస్తులు వాపోయారు. మండల తీరప్రాంతంలోని ఏరూరు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి మట్టి, గ్రావెల్, సిలికా వాహనాల రాకపోకలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కాగా వాహన డ్రైవర్లు ఆ ప్రాంతంలో ఉదయం అల్పాహారంతో పాటు భోజనం దొరక్క అవస్థలు పడ్డారు. ఈ సందర్భంగా గ్రామస్తులు శనివారం విలేకరులతో మాట్లాడుతూ గత రెండేళ్లుగా భారీ వాహనాల రాకపోకలతో పాతరోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. దీనివల్ల దుమ్ము నివాసాల్లోకి వచ్చి ఊపిరితిత్తుల వ్యాధుల బారిన పడి తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులను కోరినా, కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పట్టించుకోలేదన్నారు. తూర్పుకనుపూరు ముత్యాలమ్మ జాతర సందర్భంగా వరగలి క్రాస్‌రోడ్డు నుంచి చింతవరం వరకు తాత్కాలింకగా కొంత రోడ్డును బాగు చేయగా ఈ ప్రాంతంలో కనీసం తట్టెడు మట్టి కూడా వేయడం లేదని వాపోయారు. భారీ వాహనాలతో రోడ్డు పూర్తిగా దెబ్బతింటుంటే ఆర్‌అండ్‌బీ అధికారులు ఏమి చేస్తున్నారని నిలదీశారు. సంబంధిత కాంట్రాక్ట్ సంస్థలపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధుల నుంచి ముడుపులు తీసుకుని మిన్నకుండిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో నిత్యం అరగంటకో ఆర్టీసీ బస్సు కోట, గూడూరుకు ఉంటుండగా, రోడ్డు పూర్తిగా ధ్వంసం కావడంతో నాలుగు ట్రిప్పులను మాత్రమే తిప్పుతున్నారన్నారు. ఇప్పటికైనా రోడ్డును బాగు చేయకపోతే వాహనాలను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
అధికారుల చర్చలు విఫలం
భారీ వాహనాలను ఏరూరు గ్రామస్తులు అడ్డుకోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకున్నారు. స్థానికులతో సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. వాహనాలను నిలిపేయడం సరైన పద్ధతి కాదని, వాహనాలను వదిలేయాలని నచ్చజెప్పారు. అయితే భారీ వాహనాల రాకపోకలు సాగించాలంటే ముందుగా రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులైనా చేయాలని, లేకుంటే వాహనాలను పూర్తిగా నిలిపేయాలని పట్టుబట్టారు. కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధుల నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు వాహనాలను వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. దీంతో తహసీల్దార్ గోపీనాథ్‌రెడ్డితో పాటు రెవెన్యూ సిబ్బంది వెనుదిరిగారు. భారీ వాహనాల వద్ద బందోబస్తును పోలీసులు నిర్వహిస్తున్నారు.


