బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెండరుకు నకిలీ ధ్రువీకరణ పత్రం | - | Sakshi
Sakshi News home page

బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ టెండరుకు నకిలీ ధ్రువీకరణ పత్రం

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ఆత్మకూరుకు చెందిన వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అధినేత నాగమోహన్‌రెడ్డి. ఆయన రాష్ట్ర దేవదాయ శాఖమంత్రి అనం రామనారాయణరెడ్డికి అనుచరుడు. ఆయన టెండర్‌ వేస్తే.. పోటీదారులను తప్పించేంత అత్యంత సన్నిహితుడు. జిల్లా పంచాయతీరాజ్‌శాఖ సదరు కాంట్రాక్టర్‌ ఊబిలో పడి కూరుకుపోయింది. ఆయన మంత్రి అనుచరుడు కావడంతో అతను సమర్పించే నకిలీ సర్టిఫికెట్లను పరిశీలించకుండానే కాంట్రాక్ట్‌లు కట్టబెట్టేస్తున్నారు. ఏ శాఖలోనైనా నిర్వహించే టెండర్లకు సంబంధించి ఏ కాంట్రాక్ట్‌ సంస్థ కానీ, కాంట్రాక్టర్‌ కానీ బిడ్‌లు దాఖలు చేసే.. ఆయా టెండర్‌దారుల బిడ్‌ కెపాసిటీలు, ఆన్‌ హ్యాండ్‌ వర్కులు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు పరిశీలన చేపట్టి.. అర్హతను నిర్ధారించి, వారు దాఖలు చేసిన బిడ్‌లను ఫైనల్‌కు అనుమతించాల్సిన ఉంటుంది.

పీకల్లోతులో కూరుకుపోయిన పీఆర్‌ శాఖ

వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అధినేత ఆది నుంచి అడ్డదారుల్లో అడ్డగోలు వ్యవహారాలతో కాంట్రాక్ట్‌లు దక్కించుకోవడంలో ఆరితేరిపోయాడు. అధికారం ధీమాతో మంత్రి పేరు చెప్పుకుని అడ్డదారులు తొక్కుతున్నారు. అర్హత లేకపోయినా నకిలీ ధ్రువీకరణ పత్రాలతో టెండర్లు దక్కించుకున్నాడు. టెండర్ల విషయంలో పక్కాగా ఉండాల్సిన పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు మంత్రి అనుచరుడి విషయంలో మాత్రం నిబంధనలను కాలరాశారు. సదరు కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అర్హతలు, బిడ్‌ కెపాసిటి పరిశీలించకుండానే రూ.6.30 కోట్ల విలువైన ఆత్మకూరు బైపాస్‌ రోడ్డు పనులను అడ్డగోలుగా కట్టబెట్టిన పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు.. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌పై అనుభవం లేకపోయినా రూ.1.70 కోట్ల విలువైన పంచాయతీరాజ్‌శాఖ అతిథి భవన నిర్మాణం కాంట్రాక్ట్‌ను కట్టబెట్టేశారు.

ఆనం అనుచరుడే.. ఆయన అర్హతలు

సదరు కాంట్రాక్ట్‌ సంస్థ బిడ్‌ కెపాసిటి రూ.52 కోట్లు. ఈ సంస్థకు ఇప్పటి వరకు ఎర్త్‌ వర్కుల తప్ప.. బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌పై అనుభవం లేదు. అయితే ఇప్పటి వరకు మంత్రి అనుచరుడినని కాంట్రాక్టర్లను పోటీ నుంచి తప్పించడం, పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీర్లను మేనేజ్‌ చేసుకుంటూ తన బిడ్‌ కెపాసిటికి మించి ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో సుమారు రూ.280 కోట్ల పనులు దక్కించుకున్నట్లు విజిలెన్స్‌ విచారణలోనూ వెల్లడైంది. మంత్రి అనుచరుడు కావడంతో... అదే ఆయన అర్హతలుగా టెండర్‌ నిబంధనలను ఈ శాఖాధికారులు ఎక్కడా పట్టించుకోలేదు.

తీగలాగితే డొంక కదిలిందిలా..

గతంలో ఆత్మకూరులో బైపాస్‌రోడ్డు వర్కుకు టెండర్లు పిలవగా ఆత్మకూరుకు చెందిన ఇద్దరు కాంట్రాక్టర్లు బిడ్‌లు దాఖలు చేశారు. ఈ కాంట్రాక్ట్‌పై కన్నేసిన సదరు నాగమోహన్‌రెడ్డి ఆ పనులు దక్కించుకునేందుకు అడ్డదారులు తొక్కారనే ఆరోపణలు వినిపించాయి. ఏకంగా మంత్రి పీఏతో ఆ కాంట్రాక్టర్లకు ఫోన్‌ చేసి.. తప్పుకోవాలంటూ ఆదేశించినట్లు, వారేసిన బిడ్‌ మొత్తం తెలుసుకుని వారి కంటే తక్కువ మొత్తం 4.9 శాతం లెస్‌తో రూ.6.30 కోట్ల కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. అయితే ఈ టెండర్‌ దక్కించుకునేటప్పటికి తన బిడ్‌ కెపాసిటికి మించి ఏపీ, తెలంగాణలో ఆన్‌ హ్యాండ్‌ వర్కులు ఉన్నా.. వాటిని కనబరచకుండా ఈ రోడ్డు కాంట్రాక్ట్‌ దక్కించుకున్నాడనే ఆరోపణలు వెల్లువగా ఉన్నాయి. ఈ క్రమంలో మరో జిల్లాలోని కాంట్రాక్టర్లు వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అధినేత అక్రమాలు గుర్తించి సీఎంఓకు ఫిర్యాదు చేయడంతో అక్కడి అధికారులు స్పందించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే విచారణకు ఆదేశించడంతో సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే మంత్రి అండతో ఆ నివేదికను పక్కన పెట్టడంతో బాధిత కాంట్రాక్టర్లు విజిలెన్స్‌ విచారణకు, మరోసారి సీఎంఓకు ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్టుగా పంచాయతీరాజ్‌ శాఖలో భవన నిర్మాణ టెండర్‌లో నకిలీ ధ్రువీకరణ పత్రం విషయం వెలుగులోకి వచ్చింది.

హడావుడిగా బ్లాక్‌ లిస్టులో పెట్టేందుకు..

పంచాయతీరాజ్‌ శాఖ ఇంజినీరింగ్‌ అధికారులు తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థను, అధినేత నాగమోహన్‌రెడ్డిని బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది నవంబరులోనే ఇతని అక్రమాలు వెలుగులోకి వచ్చినా.. మంత్రి అనుచరుడిని ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టారు. తాజాగా విజిలెన్స్‌ విచారణ చేపట్టడంతో టెండర్‌ నింబంధనలు పాటించకుండా.. ధ్రువపత్రాలు పరిశీలన చేయకుండా బిడ్‌కు అనుమతించడం, ఏక పక్షంగా కట్టబెట్టిన విషయాలన్నీ వెలుగులోకి వస్తుండడంతో ఎక్కడ తమ ఉద్యోగాలుకు ముప్పు ఏర్పడుతుందని భావించి బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టేందుకు ఈఎన్‌సీకు పంపినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్‌ వ్యవహారం మంత్రికి తలబొప్పి కట్టడంతో ఆయం మౌనం దాల్చారని ప్రచారం జరుగుతోంది.

నిర్మాణంలో ఉన్న పంచాయతీరాజ్‌ శాఖ అతిథి భవనం

నాగమోహన్‌రెడ్డి దాఖలు చేసిన దేవదాయ శాఖ నకిలీ ధ్రువపత్రం నాగమోహన్‌రెడ్డి దక్కించుకున్న టెండర్‌.. అతిథి భవన శిలాఫలకం

కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తన సొంత నియోజకవర్గ కేంద్రం ఆత్మకూరులో జెడ్పీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.85 లక్షలను తొలి విడతగా మంజూరు చేయగా, మరో రూ.85 లక్షలతో కలిపి రూ.1.70 కోట్లతో పంచాయతీరాజ్‌ శాఖ అతిథి గృహం నిర్మించుకునేందుకు టెండర్లు పిలిచారు. అయితే ఈ పనులను మంత్రి ఆనం అనుచరుడు, వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ అధినేత నాగమోహన్‌రెడ్డికి దక్కేలా ఇతర కాంట్రాక్టర్లను బెదిరించి బిడ్స్‌ దాఖలు చేయకుండా అడ్డుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు ఆయన కన్‌స్ట్రక్షన్‌ సంస్థకే టెండర్‌ దక్కింది. అయితే ఈ సంస్థకు బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌లో అనుభవం లేకపోయినా.. ఉన్నట్లు ఏకంగా మంత్రి ఆనం శాఖ నుంచి నకిలీ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచారు. నంద్యాలలోని మూలమఠంలో కొలువైన శ్రీ భీమేశ్వర ఆలయ ముఖమండపం రూ.కోటి వ్యయంతో 2019–20 మధ్య పూర్తి చేసినట్లుగా అనుభవ ధ్రువీకరణ పత్రం జత చేశారు. అయితే జిల్లా పంచాయతీరాజ్‌ ఇంజినీర్లు మాత్రం అవేమి పరిశీలన కూడా చేయకుండానే మంత్రి అనుచరుడనే క్వాలిఫికేషన్‌ చూసి టెండర్‌ ఓకే చేశారు. ఆ భవన నిర్మాణ పనులు దాదాపు 30 శాతం వరకు పూర్తయ్యాయి.

ఈఎన్‌సీకి నివేదిక ఇచ్చాం

ఆత్మకూరు అతిథి గృహం భవన నిర్మాణంలో వైఎంఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ సంస్థ నకిలీ ధ్రువీకరణ పత్రం జతపరిచింది వాస్తవమే. ఈ విషయం గుర్తించి సదరు కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోమని ఈఎన్‌సీకి నివేదిక ఇచ్చాం. అక్కడి నుంచి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదు. వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం.

– కోటేశ్వరరావు,

పంచాయతీరాజ్‌ శాఖ, ఎస్‌ఈ

Advertisement
 
Advertisement
Advertisement