వెంకటాచలం: కాసుల కోసం కాంట్రాక్టర్ల కక్కుర్తి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం.. రోడ్డు పనులు ఇలాగేనా చేసేదంటూ నిలదీసేవాళ్లు లేకపోవడం వెరసి కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్య నిర్మించిన రహదారి నెల్లోపే అధ్వానంగా మారింది. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా పనులను చకాచకా పూర్తి చేయడంతో ఎక్కడ చూసినా తారు లేచిపోతూ.. కంకర రాళ్లు కనిపిస్తుండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూమంత్రంగా..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్య 2.6 కిలోమీటర్ల మేర తారు రోడ్డును రూ.1.4 కోట్లతో మంజూరు చేసింది. అయితే తమ గ్రామంలో బయట్నుంచి ఎవరో వచ్చి నిర్మాణ పనులు చేస్తే తాము అంగీకరించబోమంటూ స్థానిక టీడీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రారంభం కాలేదు. అయితే ఆ పార్టీ జిల్లా నేతలు జోక్యం చేసుకొని సర్దుబాటు చేయడంతో పనులను ఫిబ్రవరిలో ప్రారంభించారు. ఆ తర్వాత వారంలోపే పూర్తి చేసేశారు. నిర్మాణ పనుల సమయంలో అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాల్లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్ నుంచి ముడుపులు పుచ్చుకొని వీటిని పర్యవేక్షించలేదనే టాక్ నడుస్తోంది. కాంట్రాక్టర్‌ను నిలదీసే ధైర్యం లేక తాము మౌనంగా ఉండాల్సి వచ్చిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు.
ఆనందం.. ఆవిరి
కనుపూరు – చవటపాళెం గ్రామాల మధ్యలో రహదారిపై ప్రయాణం రెండు గ్రామాల ప్రజలకు మూణ్ణాళ్ల ముచ్చటగా మారింది. ఈ రోడ్డుపై అడుగడుగునా గోతులు పడి ఉండటంతో రాకపోకలకు తీవ్ర అవస్థలు పడేవారు. రాత్రి వేళ గుంతల్లో పడి ద్విచక్ర వాహనదారులు గాయపడేవారు. అయితే ఇటీవల రోడ్డు పనులను ప్రారంభించడంతో వీరిలో ఆనందం నెలకొన్నా, అది అంతలోనే ఆవిరి కావడం గమనార్హం. ప్రస్తుతం పలు చోట్ల గుంతలు పడి రోడ్డు అఽధ్వానంగా మారడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని నాణ్యతతో పనులు చేయించేలా చూడాలని కోరుతున్నారు.
చవటపాళెం సమీపంలో ఇలా..
తారు లేచిపోయి దర్శనమిస్తున్న రోడ్డు
రోడ్డు నిర్మాణంలో నాణ్యత డొల్ల
నెల్లోనే అధ్వానంగా మారిన
చవటపాళెం రోడ్డు
నిర్మాణ సమయంలో అధికారుల
పర్యవేక్షణ శూన్యం
పనులు చేయిస్తాం
చవటపాళెం రోడ్డుకు మరమ్మతు పనులు చేయిస్తాం. వరికోత మెషీన్లు, ట్రాక్టర్లతో కొన్ని చోట్ల రోడ్డు దెబ్బతినింది. వీటిని బాగు చేసేలా చూస్తాం.
– శ్రీనివాసరావు, డీఈ,
పంచాయతీరాజ్ (పీఓపీ)


