కూటమి పాలనలో సంక్షేమం కరువు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో సంక్షేమం కరువు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

గిట్టుబాటు ధరల్లేక రైతన్నల దిగాలు

దోపిడీ తప్ప అభివృద్ధి పట్టని చంద్రబాబు

ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి

మనుబోలు: కూటమి పాలనలో సంక్షేమం కరువై ప్రజలకు ఆవేదన తప్పడంలేదని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని గొట్లపాళెం, పిడూరుపాళెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను ఆరాతీశారు. గొట్లపాళెంలో ఇటీవల మరణించిన చింతా రమణారెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. పిడూరుపాళెంలో అనారోగ్యంతో బాధపడుతున్న పార్టీ నేత ఉగ్గుమూడి వేణుగోపాల్‌రెడ్డిని పరామర్శించారు. అనంతరం కాకాణి మాట్లాడారు. ఎన్నికలకు ముందు సూపర్‌ సిక్స్‌ అంటూ బూటకపు హామీలిచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక వాటిని తుంగలో తొక్కారని మండిపడ్డారు. ధాన్యానికి గిట్టుబాటు ధరల్లేక అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. తక్కువ ధరలకు ధాన్యాన్ని తెగనమ్ముకున్నాక.. మార్కెట్లో రేట్లు పెరగడం ప్రభుత్వ వైపల్యానికి నిదర్శనమని విమర్శించారు. జేసీ ఇప్పుడే నిద్ర లేచినట్లుగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామంటూ ప్రకటనలు చేయడంపై రైతులు మండిపడుతున్నారని తెలిపారు.

ఇరిగేషన్‌లో అంతులేని అవినీతి

ఇరిగేషన్‌ పేరుతో టీడీపీ నేతలు దోపిడీకి పాల్పడుతూ కోట్లాది రూపాయలను వెనుకేసుకున్నారని ధ్వజమెత్తారు. ఈ పనులపై ఏ రోజు విచారణ జరిగినా, టీడీపీ నేతలు, ఇరిగేషన్‌ అధికారులు జైలుకెళ్లడం ఖాయమన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలందరికీ ఇళ్లను మంజూరు చేయిస్తే.. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న వాటిని సైతం పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కొత్తగా పింఛన్లు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనతో విసిగిపోయిన ప్రజలు తిరిగి జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ రాజ్యం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. పార్టీ నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, కసిరెడ్డి ధనుంజయరెడ్డి, కొండూరు జనార్దన్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బత్తుల వెంకటేశ్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్‌, ఉగ్గుమూడి గోపిరెడ్డి, జయశేఖర్‌రెడ్డి, పద్మనాభరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రాఘవరెడ్డి, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement