● బస్తా రూ.12 వేలు
● తోటల్లో తగ్గిన కాయల దిగుబడి
పొదలకూరు: స్థానిక నిమ్మ మార్కెట్ యార్డులో కాయల ధరలు కొద్ది రోజులుగా నిలకడగా ఉన్నాయి. తోటల్లో దిగుబడి తగ్గుతుండటంతో ఈ పరిస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బస్తా కాయల ధరలు రూ.11 వేల నుంచి రూ.12 వేల వరకు పలుకుతున్నాయి. ధరలు తగ్గుతాయనే ఉద్దేశంతో పిందెలను కూడా వదలకుండా కోసి మార్కెట్‌కు కొందరు రైతులు తరలిస్తున్నారని వ్యాపారులు చెప్తున్నారు. కాయలు తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ధరలు భారీగా తగ్గుముఖం పట్టే అవకాశం లేదు. వేసవి తాపం బాగా పెరుగుతున్న క్రమంలో ఉత్తరాది రాష్ట్రాల్లో కాయలకు డిమాండ్ ఉంది. ఢిల్లీ మార్కెట్‌కు ఎగుమతులు బాగా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ చివరి వరకు ధరలు పతనమయ్యే పరిస్థితి ఉండదంటున్నారు. ఈలోపు కాయలు కోతకొస్తే మేలో కొంత మేర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.


