వన్యప్రాణులకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులకు ముప్పు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నాబార్డు ద్వారా..

నగరవనం కోసం నాబార్డు ద్వారా నిధులు మంజూరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ పనులను మాత్రం అటవీ శాఖ చేపట్టింది. నిధులు ఏ ఖాతా ద్వారా విడుదల చేస్తున్నారనే విషయాన్ని అటవీ అధికారులు గోప్యంగా ఉంచారు. ఈ వివరాలను అడిగితే ఉన్నతాధికారులు వెల్లడిస్తారంటూ దాటేస్తున్నారు. నెలరోజులుగా పనులు చేస్తున్నారు. టోల్‌ప్లాజాకు దగ్గరగా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని చిట్టడివిలో కొంత భూమిలో కొన్ని సంవత్సరాల క్రితం వన సంరక్షణ సమితి కింద మొక్కల పెంపకం చేపట్టారు. వృక్షాలను తొలగించడంపై అధికారులను వివరణ కోరితే రోడ్లు, చిల్డ్రన్స్‌ పార్కు, నడక మార్గం పనులు చేపడుతున్నందన అక్కడ అడ్డమొచ్చిన చెట్లను తొలగిస్తున్నామని చెప్పుకొస్తున్నారు. ఏళ్ల క్రితం నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి వాతావరణ సమతుల్యతను కాపాడుతుంటే వాటిని అధికారులే తొలగించడం ఎంతవరకు సబబని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

చిల్లకూరు: మండలంలోని బూదనం టోల్‌ప్లాజాకు దగ్గరగా జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 20 ఎకరాలకు పైగా రిజర్వ్‌ ఫారెస్ట్‌ ఉంది. ఇది రెండు భాగాలుగా ఉంటుంది. మధ్యలో పున్నపువారిపాళేనికి వెళ్లేందుకు రోడ్డు వసతి ఉంది. గతంలో మట్టిరోడ్డు ఉండగా.. నేడు అటవీ భూములకు ఆనుకుని ఉన్న పరిశ్రమల యాజమాన్యాలకు అనువుగా ఉండేలా తారురోడ్డుగా మారుస్తున్నారు. రిజర్వ్‌ ఫారెస్ట్‌లో దక్షిణం వైపు అధికంగా సుమారు 15 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చుక్కల దుప్పిలు, కుందేళ్లు, నక్కలు, అడవి పందులు, పక్షులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఇవి సమీపంలోని ప్రాంతాల్లో ఆహారం సంపాదించుకుని రిజర్వ్‌ ఫారెస్ట్‌లో తలదాచుకుంటున్నాయి. అలాంటి అటవీ ప్రాంతంలో నేడు ఆ శాఖ అధికారులే నగరవనం పేరుతో చెట్లు తొలగించేస్తున్నారు. దీంతో వన్యప్రాణాల జీవనానికి ముప్పు వాటిల్లే ప్రమాదముంది.

గూడూరుకు దూరంగా..

వాస్తవానికి గూడూరు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ప్రభుత్వ భూమిలో నగరవనాన్ని ఏర్పాటు చేయాలి. గూడూరు పరిసర ప్రాంతాల్లో అనువైన భూములు లేకపోవడంతో చిల్లకూరు మండలంలోని బూదనం టోల్‌ప్లాజా వద్ద ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ను ఎంపిక చేశారు. అయితే గతంలో ఈ ప్రాంతంలో ఇలాంటివి చేపట్టేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినా వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతుందని విరమించుకున్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం వణ్యప్రాణుల భద్రతను విస్మరించింది. గూడూరు పట్టణ ప్రాంతవాసులకు పార్కు సుమారుగా 12 కి.మీ దూరంలో ఉంటుంది.

నగరవనం పేరుతో

రిజర్వ్‌ ఫారెస్ట్‌కు ఎసరు

20 ఎకరాల్లో పార్కు

ఏర్పాటుకు సన్నాహాలు

గూడూరుకు దూరంగా ఏర్పాటు

నిధుల విషయంలో

గోప్యత పాటిస్తున్న అధికారులు

ఆ ప్రాంతంలో సంవత్సరాలుగా ఉన్న రిజర్వ్‌ ఫారెస్ట్‌ త్వరలో కనుమరుగు కానుంది.

నగరవనం ఏర్పాటు పేరుతో ప్రభుత్వం

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. చెట్లు కొట్టేస్తోంది. ఫారెస్ట్‌పై ఆధారపడిన వన్యప్రాణుల మనుగడకు ముప్పు ఏర్పడింది.

త్వరలో వెల్లడిస్తాం

బూదనం టోల్‌ప్లాజా వద్ద ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసే నగరవనంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నాం. త్వరలో పూర్తి వివరాలను వారే వెల్లడిస్తారు. నగరవనంలో చిన్న పిల్లలకు అవసరమైన ఆట వస్తువులతోపాటుగా చిన్నపాటి రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తాం.

– రమణయ్య, ఫారెస్ట్‌ రేంజర్‌,

నాయుడుపేట

Advertisement
 
Advertisement
Advertisement