నెల్లూరు(దర్గామిట్ట): ‘పదోన్నతులు, బదిలీల్లో కీలకమైన సీనియార్టీ జాబితాలో తప్పులున్నాయి. లోటుపాట్లకు ఉద్యోగులను బలి చేయకుండా అందరికీ న్యాయం చేయాలి’ అని సచివాలయ ఉద్యోగులు కోరారు. యునైటెడ్ వెల్ఫేర్ జీఎస్‌డబ్ల్యూఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు శుక్రవారం కలెక్టరేట్‌లో జరిగిన ఉద్యోగుల గ్రీవెన్స్‌లో వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగణన విధుల్లో భాగంగా పక్క సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సెల్ఫ్ ఎన్యుమరేషన్‌కు సంబంధించి టార్గెట్లు విధించి ఒత్తిడి పెంచకూడదన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి.రాజ్యలక్ష్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లోకేష్, గౌరీశంకర్, సభ్యులు వరలక్ష్మి, సునీత, సురేఖ, తేజస్విని, సుమతి పాల్గొన్నారు.
లైంగిక దాడి కేసులో
నిందితుడికి పదేళ్ల జైలు
నెల్లూరు(లీగల్): బాలికపై లైంగిక దాడిచేసి, బాల్య వివాహానికి పాల్పడినట్లు నమోదైన కేసులో నెల్లూరు రూరల్ మండలం కొత్తూరు ఎస్టీ కాలనీకి చెందిన మాణికల చిన్నసుబ్బయ్య (45)కు పదేళ్ల జైలుశిక్ష పడింది. ఇంకా రూ.20 వేల జరిమానా విధిస్తూ నెల్లూరు ప్రత్యేక పోక్సో కోర్టు న్యాయమూర్తి సిరిపిరెడ్డి సుమ శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. చిన్నసుబ్బయ్య పిల్లలు పెళ్లి చేసుకుని వేరే గ్రామాల్లో ఉన్నారు. అతను పదేళ్ల నుంచి సొంత అక్క ఇంట్లో ఉంటున్నాడు. ఆమె కూతురైన బాధితురాలిని 2021 ఫిబ్రవరి 23వ తేదీన బంధువుల ఇంటికి తీసుకెళ్తున్నానని అందర్నీ నమ్మించాడు. వెంకటాచలం మండలం నిడిగుంట గ్రామ ఎస్టీ కాలనీ సమీపంలో బాలిక మెడలో పసుపు తాడు కట్టాడు. మరుసటిరోజు ఆ గ్రామంలోని బంధువులు ఇంటికి తీసుకెళ్లి వివాహం జరిగిందని చెప్పాడు. అనుమానించిన బంధువులు ఇంట్లోకి రానీయలేదు. చివరకు చిన్నసుబ్బయ్య ఫిబ్రవరి 25న బాలికను తీసుకుని విడవలూరు మండలం దంపూరు గ్రామ ఎస్టీ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో బాలిక భయపడి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు రక్షించి పక్కరోజు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం నెల్లూరు దిశ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. అప్పటి దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ నాగరాజు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో నిందితుడికి పైమేరకు శిక్ష, జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుబిశెట్టి చంద్రశేఖర్ వాదించారు.
కండలేరులో
44.850 టీఎంసీలు
రాపూరు: కండలేరు జలాశయంలో శుక్రవారం నాటికి 44.850 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 370, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 50, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 5 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.


