మద్యం మత్తులో లైన్‌మెన్‌ విధులు | - | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో లైన్‌మెన్‌ విధులు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

సకాలంలో విద్యుత్‌ సరఫరా

ఇవ్వలేదని రైతుల ఆందోళన

ఈఈ కార్యాలయానికి లైన్‌మెన్‌ సరెండర్‌

పొదలకూరు: ఓ విద్యుత్‌ ఉద్యోగి ఫూటుగా మద్యం తాగి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి కథనం మేరకు.. పొదలకూరు సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్‌ ఆపరేటర్‌గా లైన్‌మెన్‌ బాలమురళి పనిచేస్తున్నాడు. శుక్రవారం పార్లపల్లి, చెర్లోపల్లి తదితర గ్రామాలకు ఉదయం 6:30 గంటలకు వ్యవసాయ విద్యుత్‌ను అందజేయాల్సి ఉంది. అయితే లైన్‌మెన్‌ మద్యం తాగి విధులకు హాజరైన సకాలంలో త్రీఫేజ్‌ విద్యుత్‌ ఉదయం 7:30 గంటల వరకు కూడా ఆయా గ్రామాలకు సరఫరా చేయలేదు. దీంతో రైతులు కొందరు సబ్‌స్టేషన్‌కు ఫోన్లు చేశారు. లిఫ్ట్‌ చేయకపోవడంతో వారు నేరుగా సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీశారు. అయితే బాలమురళి మద్యం మత్తులో జోగుతుండగా రైతులు విద్యుత్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో లైన్‌మెన్‌ను నెల్లూరు ఈఈ కార్యాలయానికి సరెండర్‌ చేస్తున్నట్టు పొదలకూరు డీఈ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. చాలారోజులుగా ఇదే తంతు జరుగుతున్నా సహచర ఉద్యోగులు సర్దుకుపోతూ లైన్‌మెన్‌ షిఫ్ట్‌ ఆపరేటర్‌ విధులను వారే నిర్వహించేవారు. అయితే వేసవి కాలంలో నిమ్మచెట్లకు నీరు పెట్టుకునేందుకు విద్యుత్‌ కోసం ఎదురు చూసే రైతులు కలుగజేసుకుని ఫిర్యాదు చేయడంతో బాలమురళి నిర్లక్ష్యం బయటపడింది.

Advertisement
 
Advertisement
Advertisement