ఆంక్షలు ఛేదించి.. నీరాజనాలు పలికి | - | Sakshi
Sakshi News home page

ఆంక్షలు ఛేదించి.. నీరాజనాలు పలికి

Apr 17 2026 10:50 AM | Updated on Apr 17 2026 10:50 AM

మత్స్యకారులతో జగనన్న భేటీ సక్సెస్‌

పచ్చ మీడియా పిచ్చి రాతలు..

పచ్చి అబద్ధాలు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు రూరల్‌: కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ వేదికగా మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన మత్స్యకార భేటీ కార్యక్రమం అద్భుత విజయం సాధించిందని.. ప్రభుత్వమెన్ని ఆంక్షలు పెట్టినా, గంగపుత్రులు నీరాజనం పలికారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు. తమ పార్టీ అధినేత పర్యటనకు లభించిన భారీ స్పందనను చూసి ఓర్వలేకే అక్రమ అరెస్టులతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు కూటమి ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించారు.

నీచ రాజకీయాలు

జువ్వలదిన్నెలో జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను అడ్డుకునేందుకు నీచ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడిందని ధ్వజమెత్తారు. హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు సంబంధించిన అనుమతిని చివరి నిమిషం వరకు పెండింగ్‌లో ఉంచారని విమర్శించారు. రవాణా శాఖ అధికారులతో వాహనాలను నిలిపేయించి.. బ్యారికేడ్లను పెట్టినా జనం ఆగలేదని తెలిపారు. వేట సాగనీయబోమని, పథకాలను నిలిపేస్తామని మత్స్యకారులను స్థానిక నేతలు బెదిరించినా, వేలాదిగా తరలివచ్చి జగనన్నకు నీరాజనం పలికారని వివరించారు. దీన్ని జీర్ణించుకోలేక పచ్చ మీడియా రోత రాతలు రాస్తోందని.. వారి సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని స్పష్టం చేశారు.

ఆనం.. ఆ ఘటన మీకు గుర్తుందా..?

జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు గర్హనీయమన్నారు. 2011లో సోంపేటలో మత్స్యకారులపై కాల్పులు జరిగిన సమయంలో మంత్రిగా మీరే ఉన్నారని, ఆ విషయాన్ని మరిచారానని ప్రశ్నించారు. అక్కడ థర్మల్‌ ప్లాంట్‌ వద్దన్నది తమ పార్టీ అధినేతేనని గుర్తుచేశారు. చంద్రబాబులా మతిమరుపుతో మా ట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రాంతా నికి వచ్చి వలలను తెంపి వేటాడుతున్న పొరుగు రాష్ట్ర మెకనైజ్డ్‌ బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుంటే, వాటిని విడిచిపెట్టింది టీడీపీ నేతలనే విషయం తెలియదానని నిలదీశారు. జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పనులు తమ ప్రభుత్వ హయాంలో జరిగాయని, వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు.

మత్స్యకారులకు అండగా జగన్‌

జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ పర్యటనకు జగనన్న రావడం మత్స్యకారులకు భరోసానిచ్చిందని.. కావలి నియోజకవర్గంలో దురాయి వేసినా.. ఎన్ని అంక్షలు పెట్టినా, మండుటెండను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన వారందరికీ పార్టీ తరఫున కృతజ్ఞతలను మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి తెలియజేశారు. ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేటీకరణ చర్య సరికాదని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. సమస్యలను మత్స్యకారులు తెలియజేయగా, తమ పార్టీ అధినేత భరోసా ఇచ్చారని చెప్పారు. పోలీసులు, మత్స్యశాఖ ఆధ్వర్యంలో ఉన్న బోట్లను దొంగచాటుగా ఎత్తుకెళ్తే, వాటిని తీసుకురాకుండా మీనమేషాలను ప్రభు త్వం లెక్కిస్తోందని మండిపడ్డారు.

ప్రైవేట్‌ సంస్థకు భూములివ్వడం తప్పు

మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చేసిన మంచి పనులను నిర్వీర్యం చేసే పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందని ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ధ్వజమెత్తారు. జువ్వలదిన్నె హార్బర్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్‌ సంస్థకు కట్టబెట్టడం దారుణమన్నారు. ప్రాణాలకు తెగించి బోట్లను మత్స్యకారులు పట్టుకుంటే, వాటిని వదిలేస్తారానని ప్రశ్నించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడారు. చేపల వేట నిషేధ సమయంలో సాయం చేయాలని మత్స్యకారులు అభ్యర్థించగా, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.పది వేలను అందజేసి మాటను తమ పార్టీ అధినేత నిలబెట్టుకున్నారని చెప్పారు. పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పూజిత మాట్లాడుతూ.. జగనన్న అధికారంలోకి వచ్చిన వెంటనే జువ్వెలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను మత్స్యకారులకు అప్పగిస్తారని తెలిపారు. మత్స్యకారుల కడుపు కొడుతుంటే ప్రశ్నించాల్సింది పోయి, సిగ్గు లేకుండా సమర్థించడం పొరపాటని పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. పదవి కోసం పాకులాడకుండా ప్రజల కోసం పనిచేయాలని రామనారాయణరెడ్డికి హితవు పలికారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతున్న ఆయన అసలు మంత్రేనానని నిలదీశారు. ఎమ్మెల్సీ, పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement