నెల్లూరు(పొగతోట): స్వచ్ఛ కార్యక్రమాలపై డీఎల్పీఓలు, ఎంపీడీఓలకు శిక్షణ కార్యక్రమాలను నగరంలోని జెడ్పీ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయాలని సూచించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. సీఈఓ శ్రీధర్‌రెడ్డి, డీపీఓ వసుమతి తదితరులు పాల్గొన్నారు.
పోర్టు కార్మికుల నిరసన
ముత్తుకూరు(పొదలకూరు): అదానీ కృష్ణపట్నం పోర్టులోని సబ్ కాంట్రాక్ట్ కంపెనీల్లో పనిచేస్తున్న సుమారు 200 మంది కార్మి కులు.. మేనేజర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముత్తుకూరు సెంటర్‌లో నిరసనను గురువారం వారు చేపట్టారు. పనిభారం అధికంగా ఉందని, వేతనం మాత్రం సరిపడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అనంతరం కార్మికులు మాట్లాడారు. దాదాపు 12 గంటలకుపైగా పని చేయించుకుంటున్నా, వేతనాలను మాత్రం పెంచడంలేదని ఆరోపించారు. పని ముగిశాక ఎలాంటి రవాణా సదుపాయాన్ని కల్పించకపోవడంతో పోర్టు నుంచి ముత్తుకూరుకు నడిచి రావాల్సి వస్తోందని వాపోయారు. బిహార్, జార్ఖండ్, ఒడిశా నుంచి వచ్చి బెల్టు వర్కులు, వెల్డింగ్, బ్రిడ్జి, ఎలక్ట్రికల్ పనుల్లో నిమగ్నమైన తమను అధిక పనిభారంతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే కంపెనీ యాజమాన్యం బెదిరింపులకు దిగుతోందని చెప్పారు. కార్మికులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి సంబంధిత ప్రైవేట్ కంపెనీ మేనేజర్‌ను నిలదీశారు. చివరికి సమస్యలను పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో విధులకు కార్మికులు హాజరయ్యారు.


