అడుగడుగునా జగనోత్సాహం | - | Sakshi
Sakshi News home page

అడుగడుగునా జగనోత్సాహం

Apr 16 2026 10:24 AM | Updated on Apr 16 2026 10:24 AM

ఉదయం ఏడు గంటల నుంచే

వేలాది మంది రాక

మహిళలు, యువత జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతూ పరుగులు

ఉప్పు కాలువలో పడవల్లో వైఎస్సార్‌సీపీ జెండాలతో జగన్‌కు స్వాగతం

ఎండవేడి, ఉక్కపోతను లెక్క చేయకుండా చంటిబిడ్డలతో

సహా వచ్చిన గంగపుత్రులు

సాగర్‌ డిఫెన్స్‌ శిలాఫలకానికి పోలీసు భద్రత

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె పర్యటనతో కడలి తీరం.. జనసునామీగా మారింది. ఫిషింగ్‌ హార్బర్‌ ప్రైవేట్‌ పరం కానివ్వబోమని, ప్రతి మత్స్యకారుడిని మెకనైజ్‌ బోట్లకు యజమానులను చేస్తానని హామీ బతుకు, భవిష్యత్‌పై బెంగ ఉన్న గంగపుత్రుల్లో కొండంత భరోసానిచ్చింది. ప్రభుత్వ పెద్దలే కుట్రధారులుగా మారి జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ భూములు ప్రైవేట్‌ పరం చేయడం, తమిళ బోట్లువదిలేసిన వ్యవహారంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మత్స్యకారులకు ధైర్యానిచ్చారు. మండు వేసవి ఎండను సైతం లెక్క చేయకుండా మత్స్యకార యువత, మహిళలు తురుపులు తురుపులుగా తలిరావడంతో సాగరతీరంలో జగనోత్సాహం ఉప్పొంగింది.

బిట్రగుంట: తీర ప్రాంతానికి, మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకు వచ్చేందుకు, వారికి భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా జువ్వలదిన్నెకు బుధవారం రావడంతో సుమారు 64 మత్స్యకార గ్రామాల నుంచి మత్స్యకారులు భారీగా తరలివచ్చారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా ఉదయం ఏడు గంటలకే, జగన్‌ రాకకు సుమారు మూడు గంటల ముందుగానే జిల్లాతో పాటు ప్రకాశం, ఇతర తీర ప్రాంత జిల్లాల నుంచి సుమారు పది వేల మందికి పైచిలుకు జువ్వలదిన్నె చేరుకున్నారు. హెలిప్యాడ్‌ నుంచి సభా స్థలి మీదుగా ఫిషింగ్‌ హార్బర్‌ వరకూ ఇసుక వేస్తే రాలనంతంగా జనం నిండిపోయారు. ఒక వైపు తీరంలో ఉండే ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా విపరీతమైన ఎండ, ఉక్కపోతతో చెమటలు తడిపేస్తున్నా లెక్క చేయకుండా జగన్‌ కోసం ఎదురుచూస్తు ఉండిపోయారు. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9.45 గంటలకు వైఎస్‌ జగన్‌ హెలికాప్టర్‌లో జువ్వలదిన్నె చేరుకోవాల్సి ఉండగా కాస్త ఆలస్యంగా 10.16 గంటలకు చేరుకున్నారు. అనంతరం హెలిపాడ్‌ వద్ద దిగిన జగన్‌కు మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు మత్స్యకారులు, ప్రజలు వేలాదిగా తరలి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. తొలుత ఇక్కడికి చేరుకున్న మత్స్యకారులను చూసి హెలికాప్టర్‌ నుంచే జగన్‌ అభివాదం చేశారు. అప్పటికే హెలిప్యాడ్‌ చుట్టూ వేలాదిగా జనం చేరిపోయారు. మరో వైపు స్థానిక మత్స్యకారులు, మహిళలు హెలికాప్టర్‌ చూసిన వెంటనే పరుగు పరుగున జగనన్నను చూసేందుకు పొలాల మీదుగా పరుగులు తీస్తూ వచ్చారు. తన కోసం వేచి ఉన్న మత్స్యకారులకు అభివాదం చేస్తూ జగన్‌ మత్స్యకారులు, కాపులు, గ్రామ పెద్దలతో కలిసి వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించారు. వలసలు నివారించి, మత్స్యకారులకు స్థిరమైన ఉపాధి, మత్స్య సంపదకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో నిర్మించిన హార్బర్‌ను స్వయంగా పరిశీలించారు. హార్బర్‌లో నిర్మించిన చిల్లింగ్‌, ఐస్‌ప్లాంట్లు, వలల రిపేర్‌ గదులను నిశితంగా పరిశీలించారు.

అందరినోటా అదే మాట

మత్స్యకారులు మంచివాళ్లు, సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్లు. ఒకసారి మంచి చేస్తే జీవితాంతం గుర్తుంచుకుంటారు. వైఎస్‌ జగన్‌ జువ్వలదిన్నె పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి స్పష్టమైంది. జగన్‌ రాకకు రెండు గంటల ముందే వేలాదిగా తరలివచ్చిన మత్స్యకారులు తమ పిల్లలను కూడా తీసుకువచ్చారు. జగన్‌ వచ్చిన వెంటనే ‘అదిగో జగనన్న...ఆయనే మనకు హార్బర్‌ కట్టించింది’ అంటూ తమ పిల్లలకు చెప్పి జగన్‌మోహన్‌ రెడ్డిని చూపించడం కనిపించింది. మత్స్యకార మహిళలు, యువత కూడా మాకు హార్బర్‌ కట్టించిన జగనన్న వచ్చాడు అంటూ సంబరంగా సభా వేదిక వద్ద జై జగనన్న... మీరు కట్టించిన హార్బర్‌తో మాకు భవిష్యత్‌పై నమ్మకం వచ్చింది అన్నా.. మాపిల్లలు పొట్ట చేత పట్టుకుని పక్కరాష్ట్రాలకు వలసలు వెళ్లే బాధ తప్పుతుంది అన్నా అంటూ నినాదాలు చేశారు.

కడలూరు బోట్లపై ఫిర్యాదు

కడలూరు బోట్ల కారణంగా జిల్లాలోని తీర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై మత్స్యకారులు జగన్‌మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. పెద్ద బోట్లు, వలలతో మన తీరంలోకి వేటకు వస్తున్న బోట్లు ఇక్కడి మత్స్య సంపదను దోచేస్తున్నాయని, వాటి కారణంగా తమ వలలు దెబ్బతింటున్నాయని విన్నవించారు. కడలూరు బోట్లను ప్రాణాలకు తెగించి పట్టుకుని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచగా, ప్రభుత్వంలోని వారు బోట్ల యజమానులతో లాలూచీ పడి తమను మోసం చేసి పడవలు తప్పించారని జగన్‌ దృష్టికి తీసుకొచ్చారు. పడవలు తప్పించిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఫిర్యాదు చేశారు.

జగన్‌ అనే నేను.. మాటిస్తున్నా..!

ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులతో మమేకమయ్యారు. జగనన్న మీరే ఈ హార్బర్‌ను కాపాడాలన్నా.. అంటూ వలసతో తాము పడిన కష్టాలను, హార్బర్‌ సిద్ధమైన తర్వాత జరిగిన మేలు ఇదంటూ వివరించారు. కేవలం పది శాతం పనులు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయని, అవి కూడా పూర్తయితే మత్స్యకారుల భవిష్యత్‌కు బంగారుబాట అవుతుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పనులు పక్కన పెట్టి సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీకి భూములు కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని మత్స్యకారులు కన్నీటితో జగన్‌కు నివేదించారు. ‘అన్నా... మీ అందరికి మాటిస్తున్నాను. గట్టిగా కళ్లు మూసుకుని తెరిచే లోపు మూడేళ్లు అయిపోతాయి.. వచ్చేది మన ప్రభుత్వమే. ఫిషింగ్‌ హార్బర్లు మీ హక్కు, ఆస్తిగా మీకు తప్ప మరెవరికి చెందకుండా చూస్తాను. ప్రతి కుటుంబాన్ని యజమానులను చేస్తాను’ అంటూ జగన్‌ చెప్పడంతో.. ‘జగనన్నా.. నిన్ను నమ్ముతున్నామన్నా.. మీరే మాకు దిక్కు..’ అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా సభాస్థలికి చేరుకున్న జగన్‌ మత్స్యకారులతో ముఖాముఖి సమావేశమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement