● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరురూరల్: ‘వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ప్రతినిధి శ్రీహరి అక్రమ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రశ్నించే గొంతును నొక్కే ప్రయత్నం చేయడమే’ అని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో కాకాణి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు ఎక్కువయ్యాయన్నారు. పూడి శ్రీహరి గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీహరి చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్‌గా పనిచేశారన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ మీడియా విభాగానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారన్నారు. ఎప్పుడూ అసభ్యపదజాలం వాడరని, ఎవరిని వ్యక్తిగతంగా దూషించే అలవాటు లేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారన్నారు. పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శ్రీహరి ప్రధాన కారకుడిగా భావించి, ఆ విభాగాన్ని బలహీనపరచాలనే లక్ష్యంతోనే అక్రమ అరెస్ట్ జరిగిందన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని హైకోర్టు ఆదేశాలున్నా, సివిల్ డ్రెస్‌లో వెళ్లి శ్రీహరిని అదుపులోకి తీసుకోవడం చట్ట విరుద్ధమన్నారు. సోషల్ మీడియా కేసుల్లో బెయిల్ ఇవ్వాలని, రిమాండ్‌కు పంపకూడదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా ఇప్పటివరకు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచకుండా వేధింపులకు గురిచేయడం దారుణమన్నారు. భవిష్యత్‌లో ఎవరూ కూటమి నాయకులను ప్రశ్నించకుండా ఉండేలా, బెదిరించడానికి, బ్లాక్ మెయిల్ చేయడానికే, అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. శ్రీహరి అరెస్ట్‌ను కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, జర్నలిస్టులే కాకుండా సామాన్య ప్రజలు కూడా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్‌లు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం, అక్రమంగా జైలుకు పంపడం వంటి చర్యలు మానుకోవాలన్నారు. శ్రీహరిని భేషరతుగా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర డీజీపీని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఏదైనా ఉంటే న్యాయస్థానంలో తేల్చుకోవాలి గానీ, ఇలాంటి వేధింపులు సరికాదన్నారు.


