● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): ప్రతి విద్యార్థి తప్పనిసరిగా రాజ్యాంగాన్ని చదవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. నెల్లూరు నగరంలోని శ్రీవెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రణాళికాబద్ధంగా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రధానంగా హాస్టళ్ల పరిస్థితులను పూర్తిగా మార్చి చూపిస్తానన్నారు. వచ్చే ఏడాది అంబేడ్కర్ జయంతి నాటికి మీ ముందుకు తన ప్రోగ్రెస్ కార్డు తీసుకొస్తానని తెలిపారు. జిల్లాకు కొత్త పరిశ్రమలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు బాగా చదివితే నెల్లూరులోనే ఉద్యోగాలందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించబోమన్నారు. పలువురు ఎస్సీ, ఎస్టీ సంఘాల నేతలు అంబేడ్కర్ జీవిత చరిత్ర, త్యాగాలను, సమాజంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలను విద్యార్థులకు తమ ప్రసంగాల ద్వారా వివరించారు. అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్ భవనాలను నిర్మించాలని కలెక్టర్‌ను కోరారు. అనంతరం జాషువా లైబ్రరీ చైర్మన్ ఖాసిం కలెక్టర్ చేతుల మీదుగా విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో నగర మేయర్ సుజాత, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ శోభారాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● తొలుత వీఆర్సీ కూడలిలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.


