కోవూరు: టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలకు పాల్పడుతూ అడ్డంగా బుక్కయ్యారని, ఇలాంటి వ్యక్తిని నియమించి తిరుమల పవిత్రతను టీడీపీ మంటగలుపుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకుడు వీరి చలపతిరావు మండిపడ్డారు. మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక షుగర్ ఫ్యాక్టరీ సమీపంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడారు. బీఆర్ నాయుడి వీడియోలు వైరలై, ప్రజలు ఛీదరించుకుంటున్నా, ఆయన్ను పదవి నుంచి తొలగించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నేనింతే.. ఇలాగే ఉంటాను.. మీరేమి చేసుకుంటారో చేసుకోండంటూ తిరుమలలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఆయన్ను తొలగించకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలను ఉధృతం చేయనున్నామని చెప్పారు. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన తిరుమలలో వివాదాస్పద వ్యక్తుల పెత్తనమేమిటని ప్రశ్నించారు. అనంతరం పార్టీ కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు మాట్లాడారు. ఇలాంటి వ్యక్తులతో తిరుగుతున్న చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగలడం ఖాయమని చెప్పారు. భక్తుల మనోభావాలను గాయపర్చినందుకు గానూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీఎల్డీఏ మాజీ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్, రైతు విభాగ జిల్లా అధ్యక్షుడు నరసింహులురెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, సుబ్బారెడ్డి, మండల కన్వీనర్లు శేషగిరిరావు, సతీష్‌రెడ్డి, షాహుల్, నవీన్‌కుమార్‌రెడ్డి, లక్ష్మీకుమారి, శ్రీలత, ఉమా తదితరులు పాల్గొన్నారు.


