సంగం: అతివేగం, ఆపై డ్రైవర్ నిద్రమత్తు వెరసి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. వివరాలు.. అనంతపురం నుంచి నెల్లూరు వైపు ఆర్టీసీ బస్సు 22 మంది ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజేష్.. ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ పరిశీలించి, వివరాలను ఎస్సై, సీఐ గంగాధర్‌ను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు ఉస్మాన్‌సాహెబ్‌పేటకు చెందిన సుజాత, శ్రీనివాసులు, వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన అశోక్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తికి ప్రాథమిక చికిత్సను 108 సిబ్బంది అందించి ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటన స్థలాన్ని ఆత్మకూరు ఎమ్వీఐ రాములు పరిశీలించి.. డ్రైవర్, స్థానికులతో మాట్లాడారు. బస్సును క్రేన్ సాయంతో పక్కకు తొలగించారు. అనంతరం సంబంధిత డిపోకు తరలించారు.


