పాత పింఛన్లకు బాబు పబ్లిసిటీ దుబారా | - | Sakshi
Sakshi News home page

పాత పింఛన్లకు బాబు పబ్లిసిటీ దుబారా

Apr 2 2026 7:17 AM | Updated on Apr 2 2026 7:17 AM

కొత్తవి మంజూరుకు నేటికీ దిక్కులేదు

జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వాటికి

కోతలు విధిస్తూ..

ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం: పాత పింఛన్లను కొత్తగా ఇస్తున్నామనే రీతిలో చంద్రబాబు పబ్లిసిటీ పేరుతో ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని కంటేపల్లిలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 22 నెలలవుతున్నా, కొత్త పింఛన్ల మంజూరుకు దిక్కులేదని ఆరోపించారు. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మంజూరు చేసిన వాటికి కోతలు విధిస్తున్నారని ధ్వజమెత్తారు. నాడు మంజూరు చేసిన పింఛన్లను తమ ఘనతగా చంద్రబాబు మొదలుకొని సాధారణ కార్యకర్త వరకు నానా హడావుడి చేస్తున్నారని విమర్శించారు.

దుబారా ఖర్చులు మానేస్తే కొత్తగా ఇవ్వొచ్చు

పాత పింఛన్ల పంపిణీ పేరిట విమానాలు, హెలికాప్టర్లలో తిరగడం, ప్రభుత్వ ఖర్చుతో సమావేశాలను నిర్వహించడాన్ని చంద్రబాబు మానేస్తే, కనీసం కొందరికైనా కొత్తగా మంజూరు చేయొచ్చని చెప్పారు. కొత్త వాటిని ఎప్పుడిస్తారానని వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, కళాకారులు వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారని చెప్పారు. వితంతువులకు మంజూరు చేయడంలో చంద్రబాబుకు కనికరం లేదన్నారు. పర్యటనల్లో తానేమి చేశానో చంద్రబాబు చెప్పుకోలేక, నాటి తమ పార్టీ ప్రభుత్వాన్ని, జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

పతనమవుతున్న ధాన్యం ధరలు

ధాన్యం ధరలు రోజురోజుకూ పతనమవుతున్నాయని చెప్పారు. కూటమి పాలనలో పెరిగిన ఎరువుల ధరలతో పెట్టుబడి వ్యయం ఎక్కువై కనీసం ఆ ఖర్చులూ రావడంలేదని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని చెప్పారు. టీడీపీ హయాంలో అన్నదాతలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. యూరియా సక్రమంగా అందక, సాగునీరు సాఫీగా పారక అష్టకష్టాలు పడి పంటలు పండించుకుంటే, ధాన్యం చేతికొచ్చే సమయానికి మద్దతు ధర లేక కర్షకులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి పాలకులు, అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు, దళారులు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు.

మిన్నంటుతున్న ఆక్రందనలు

సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్న సమయంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలో 70 నుంచి 80 శాతం ధాన్యాన్ని సేకరించారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం అన్నదాతల ఆక్రందనలు మిన్నంటుతున్నాయని చెప్పారు. వీరిని పట్టించుకునే నాథుడే కరువయ్యారని విమర్శించారు. మంత్రులు, నేతలు, అధికారులు మాటలు చెప్పి వెళ్లిపోవడమే తప్ప క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల పక్షాన నిలిచి ధరలు పెరిగేలా చూడటంలేదని మండిపడ్డారు.

పుట్టిపై నిత్యం రూ.500 తగ్గుదల

జిల్లాలో ధాన్యం ధరలు చూస్తే గుండెతరుక్కుపోతోందని చెప్పారు. జిల్లాలో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు కూడా కాలేదని, పుట్టి రూ.22 వేలు ఉండగా.. ఇవి ప్రారంభమైన నాటి నుంచి ఈ రోజుకు రూ.17 వేలకు చేరాయంటే.. సగటున రోజుకు రూ.500 మేర తగ్గించేస్తున్నారని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా తెరిచి మూడు రోజులకే మూసేశారని ఆరోపించారు. గోనె సంచులను అందించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. ధాన్యం రవాణా సౌకర్యాన్ని కల్పించలేక అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. ప్రాథమిక సహకార సంఘాల చైర్మన్లు, అధ్యక్షులు.. దళారుల అవతారమెత్తి.. రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసి వారి పాస్‌పుస్తకాలను తీసుకొని, అధిక మొత్తానికి ప్రభుత్వానికి విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు చెప్పిన విధంగా జిల్లాలో 50 వేల టన్నుల ధాన్యాన్ని పూర్తిగా దళారులు, వ్యాపారుల వద్ద సేకరించిందే తప్ప, రైతుల నుంచి కొనుగోలు చేయలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా కళ్లు తెరిచి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని, లేని పక్షంలో రైతులతో కలిసి తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement