నెల్లూరు సిటీ: తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించి ఉత్తమంగా చూడాలని తల్లిదండ్రులు సంకల్పించారు. ఇందులో భాగంగా పొదలకూరు మండలం నుంచి నెల్లూరొచ్చి ఉన్నంతలో తమ పిల్లలను బాగా చూసుకుంటున్నారు. వీరి ఆశలకు తగిన విధంగానే కుమార్తె బీటెక్ చివరి సంవత్సరం చదువుతూ.. తన ఉజ్వల భవిష్యత్తుకు బాటలేసుకుంటోంది. ఈ తరుణంలో ఓ భవన నిర్మాణ యజమాని నిర్లక్ష్యం.. యువతి ప్రాణాలను బలిగొని ఇంటి ఆశలను చిదిమేసిన హృదయ విదారక ఘటన బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
ఆనందంగా వెళ్లి.. విగతజీవిగా వచ్చి
పొదలకూరు మండలంలోని పద్మావతినగర్‌కు చెందిన చింతగింజల వెంకటేశ్వర్లు, పావని దంపతులకు కుమార్తెలు హర్షిత (22), పూజిత, కుమారుడు లోకేష్ ఉన్నారు. నగరంలోని నాలుగో మైలుకు కొంతకాలం క్రితం వచ్చి కుటుంబంతో సహా అద్దె ఇంట్లో ఉంటున్నారు. కిసాన్‌నగర్‌లోని ఓ రైస్ మిల్లులో గుమాస్తాగా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె హర్షిత గీతాంజలి కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నగరంలోని ఓ వస్త్ర దుకాణంలో దుస్తులను కొనుగోలు చేసి స్కూటీపై ఇంటికి బయల్దేరారు. వాహనాన్ని తండ్రి నడుపుతుండగా, వెనుక కుమార్తె కూర్చున్నారు. ఇంటికి మరో రెండు కిలోమీటర్ల దూరం ఉందనగా, కిసాన్‌నగర్ వద్ద రోడ్డుపై పోసిన ఇసుక కారణంగా బైక్ అదుపుతప్పింది. వెనుక నుంచి వస్తున్న లారీ చక్రాల కింద హర్షిత పడింది. తీవ్రంగా గాయపడటంతో 108కు స్థానికులు సమాచారమిచ్చారు. వారొచ్చి పరిశీలించి, అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. అటువైపు పడటంతో ప్రాణాపాయం నుంచి తండ్రి తప్పించుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. నార్త్ ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అంతులేని నిర్లక్ష్యం.. అధికారుల నిర్లిప్తత
వాస్తవానికి రోడ్డుపై భవన నిర్మాణ సామగ్రి ఉండకూడదంటూ కార్పొరేషన్ అధికారులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. అలాంటిది కిసాన్‌నగర్‌లో ఓ భవన నిర్మాణం కోసం ఇసుకను నడిరోడ్డుపై పోసినా, ఎలాంటి చర్యలకు ఉపక్రమించలేదు. అంతులేని ఈ నిర్లక్ష్యం.. ఎంతో ఉజ్వల భవిష్యత్తున్న ఓ విద్యార్థినిని చిదిమేసింది. అసలే సిమెంట్ రోడ్డు.. ఆపై ఇసుకను పోయడంతో బ్రేక్ వేసే క్రమంలో బైక్ అదుపుతప్పి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కార్పొరేషన్ అధికారుల తీరుపై కుటుంబసభ్యులు మండిపడ్డారు. ఆ ప్రాంతంలో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా భారీ లోడుతో లారీలు నగరంలోకి రావడం సైతం ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.
రోడ్డుపై ఇసుకను పోసిన భవన యజమాని
వాహనం అదుపుతప్పి
కిందపడిన ఇంజినీరింగ్ విద్యార్థిని
లారీ చక్రాలెక్కడంతో
అక్కడికక్కడే దుర్మరణం
కుటుంబసభ్యుల ఆందోళన


