● రూ.1.5 లక్షల విలువైన
మత్స్య సంపద స్వాధీనం
ముత్తుకూరు(పొదలకూరు): కృష్ణపట్నం సముద్ర తీరంలో చేపల వేటను అక్రమంగా సాగిస్తున్న తమిళనాడు మత్స్యకారులను అధికారులు వెంబడించి పట్టుకున్నారు. పెట్రోలింగ్‌ను జిల్లా మత్స్య శాఖ జేడీ శాంతి, మైరెన్ ఎస్సై అంజిరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బుధవారం చేపట్టారు. హై స్పీడ్ బోటులో ప్రయాణించిన అధికారులు.. చైన్నెకి చెందిన ఒక బోటు, సుమారు రూ.1.5 లక్షల విలువైన మత్స్య సంపదను స్వాధీనం చేసుకొని జువ్వలదిన్నె హార్బర్‌కు తీసుకెళ్లారు. బోటులో ఉన్న మత్స్యకారులను రక్షణ శాఖ అదుపులోకి తీసుకుంది. మరికొన్ని బోట్లు పరారయ్యాయని తెలిపారు. ఏడీ చాంద్‌బాషా పాల్గొన్నారు.
ఆరోగ్యశ్రీ ఓపీ సేవల నిలిపివేత
నెల్లూరు(అర్బన్): ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)లో ఏళ్లుగా పేరుకుపోయిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ పిలుపు మేరకు నెల్లూరులో ఓపీ సేవలను పలు ఆస్పత్రుల యాజమాన్యాలు బుధవారం నిలిపేశాయి. అత్యవసర కేసులకే చికిత్సను అందిస్తున్నారు. నగరంలోని అరవింద్ కిడ్నీ సెంటర్, నెల్లూరు ఆస్పత్రి, రాజశేఖర్ కంటి ఆస్పత్రి, రెయిన్‌బో, ఎయిమ్స్ తదితర హాస్పిటళ్లలో సేవలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా అరవింద్ కిడ్నీ సెంటర్ అధినేత, ఏపీ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నారాయణరావు మాట్లాడారు. జిల్లాలో 36 నెట్‌వర్క్ ఆస్పత్రులకు సంబంధించి సుమారు రూ.200 కోట్ల వరకు బకాయిలున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీని ప్రారంభించిన తొలినాళ్ల ప్యాకేజీనే ఇప్పటికే అమలు చేస్తోందని వివరించారు. నిధులను విడుదల చేయకపోవడంతో అప్పులపాలవుతున్నాని, విధిలేని పరిస్థితుల్లోనే సమ్మె బాట పట్టామని వెల్లడించారు. సమ్మెను మరిన్ని ఆస్పత్రులకు విస్తరించనున్నామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే అత్యవసర కేసులకు వైద్యాన్ని అందించలేమని స్పష్టం చేశారు.
కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును ఈ నెల పది వరకు పొడిగించారని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 – 27 విద్యా సంవత్సరానికి 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు.. ఏడు నుంచి పది, 12వ తరగతుల్లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వెబ్‌సైట్‌లో డీఎల్‌ఈడీ వివరాలు
నెల్లూరు (టౌన్): డైట్‌లో ఇంటర్మీడియట్ అర్హతతో నిర్వహించనున్న రెండేళ్ల డిప్లొమా కోర్సు (డీఎల్‌ఈడీ)లో ప్రవేశాలకు సంబంధించిన వివరాలను apdeecet.apcf ss.in, cse.ap.gov.inలో పొందుపర్చామని డీఈఓ బాలాజీరావు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటనను బుధవారం విడుదల చేశారు.


