● రూ.32 వేల లంచం
తీసుకుంటూ పట్టుబడిన వైనం
● చేజర్ల రెవెన్యూలో అవినీతి కంపు
● ఇతర అధికారుల పాత్రపై ఆరా
చేజర్ల: నిషేధిత భూముల జాబితా నుంచి సర్వే నంబర్‌ను తొలగించేందుకు రూ.32 వేల లంచాన్ని డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు వీఆర్వో బుధవారం పట్టుబడ్డారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ వివరాల మేరకు.. చేజర్ల మండలంలోని వావిలేరు పంచాయతీ మజరా గ్రామమైన దొరువుపాడుకు చెందిన గంటా అంజిబాబుకు సంబంధించిన 1.53 ఎకరాల భూమి ఏటూరు రెవెన్యూ పరిధిలో ఉంది. దీన్ని నిషేధిత భూముల జాబితాలో చేర్చారు. ఈ తరుణంలో తనకు హక్కులున్నాయని.. నిషేధిత భూముల జాబితా నుంచి సదరు సర్వే నంబర్‌ను తొలగించాలంటూ కలెక్టర్‌కు అర్జీని బాధితుడు ఇటీవల అందజేశారు. విచారణ జరిపి సదరు రైతుకు న్యాయం చేయాలంటూ చేజర్ల తహసీల్దార్‌కు కలెక్టర్ సిఫార్సు చేశారు. క్షేత్రస్థాయి విచారణ నిమిత్తం సదరు ఫైల్‌ను వీఆర్వో వంశీ ప్రదీప్‌కుమార్‌కు పంపారు. దీంతో వీఆర్వో చుట్టూ అంజిబాబు పలుమార్లు తిరిగి విచారణ నివేదికను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. అయితే సదరు పొలంలో నలుగురు అన్నదమ్ములు భాగస్తులు కావడంతో రూ.ఎనిమిది వేల చొప్పున రూ.32 వేలను ఇవ్వాలని వీఆర్వో డిమాండ్ చేశారు. తానంత ఇచ్చుకోలేనంటూ బాధితుడు ప్రాధేయపడ్డారు. అయితే ఇందులో తహసీల్దార్‌కు వాటా ఇవ్వాల్సి ఉంటుందని వీఆర్వో తెలిపారని బాధితుడు ఆరోపించారు. దీనికి అంగీకరించని అంజిబాబు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఈ తరుణంలో పక్కా ప్రణాళిక మేరకు ఆదూరుపల్లి సెంటర్‌లోని టీ స్టాల్ వద్ద అంజిబాబు నుంచి లంచాన్ని వీఆర్వో తీసుకుంటుండగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని విచారణ నిమిత్తం స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.
తహసీల్దార్ పాత్రపై విచారణ
ఈ ఉదంతంలో చేజర్ల తహసీల్దార్ పాత్రపై ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో నిషేధిత జాబితా నుంచి ఇటీవల కాలంలో ఎంత మేర భూములు విముక్తి పొందాయాననే అంశాలను ఆరాతీస్తున్నారు. మండలంలో ఇటీవలి కాలంలో నిషేధిత భూముల జాబితాను పలుమార్లు తారుమారు చేసి ఉన్నతాధికారులు విచారణ జరిపిన ఘటనలూ ఉన్నాయి. దీనికి తోడు ఏసీబీ అధికారుల దాడులతో ఆయా గ్రామాల వీఆర్వోల్లో ఆందోళన మొదలైంది.


