డయల్‌ యువర్‌ ఎస్‌ఈ నేడు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ఎస్‌ఈ నేడు

Mar 9 2026 7:18 AM | Updated on Mar 9 2026 7:18 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): జిల్లాలోని విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విద్యుత్‌ భవన్‌లో ఉదయం 8.30 నుంచి 9.30 వరకు కార్యక్రమాన్ని జరపనున్నామని, సమస్యలను 0861 – 2320427 నంబర్‌కు తెలియజేయాలని కోరారు.

రౌడీషీటర్‌పై పీడీ యాక్ట్‌

నెల్లూరు(క్రైమ్‌): రౌడీషీటర్‌ మనోజ్‌ అలియాస్‌ మనోజ్‌కుమార్‌పై పీడీ యాక్ట్‌ను సంతపేట పోలీసులు ఆదివారం ప్రయోగించారు. స్థానిక పోలీస్‌స్టేషన్లో వివరాలను ఇన్‌స్పెక్టర్‌ సోమయ్య వెల్లడించారు. ముత్తుకూరు మండలం నారికేళపల్లికి చెందిన మనోజ్‌కుమార్‌.. వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ప్రస్తుతం నివాసం ఉంటున్నారు. సంతపేట పోలీస్‌స్టేషన్లో రౌడీషీట్‌ ఉంది. నగరంలోని పెన్నా సమీపంలో గతేడాది అక్టోబర్‌లో చోటుచేసుకుంటున్న జంట హత్యకేసుల్లో ఇతను నిందితుడు. ప్రస్తుతం జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్నారు. కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అనుమతితో మనోజ్‌పై పీడీ యాక్ట్‌ను నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. కడప కేంద్ర కారాగారానికి తరలించనున్నామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

జాతర ఘటోత్సవం

ప్రారంభం

చిల్లకూరు: మండలంలోని తీర ప్రాంతంలో కొలువైన ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించే పోలేరమ్మ జాతరకు తొలి ఘట్టం ప్రారంభమైంది. మూడో చాటింపును ఆదివారం వేసిన అనంతరం ఘటోత్సవాన్ని నిర్వహించారు. ఈ నెల 10 నుంచి 13 వరకు నిర్వహించనున్న జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలిరానున్నారు. జాతరకు ముందొచ్చే ఆదివారాన ఆలయ ప్రధానార్చకుడి ఇంటి నుంచి ఘటం కుండలు పంచాయతీలోని ఐదు గ్రామాల్లో తిరిగి తూర్పుకనుపూరుకు మంగళవారం రాత్రికి చేరుకుంటే పోలేరమ్మను గంగ మిట్టపైకి తీసుకొచ్చి వేడుకను ప్రారంభించడం ఆనవాయతీ. ఈ క్రమంలో ఆలయ ప్రధానార్చకుడు చాకిరి రమణయ్య ఇంటి వద్ద ఘటం కుండలకు పూజలు చేశారు. అనంతరం కుండలో చద్ది పోసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామస్తుల కిలారింపులతో ఘటం కుండలను గ్రామంలోని ప్రధానమైన ఐదు కుటుంబాల ఇంటికి తీసుకెళ్లి అక్కడ చద్ది పోయించుకొని తిరిగి ప్రధానార్చకుడి ఇంటికి వేకువజామున తీసుకురానున్నారు. ఒబ్బాయి శివకుమార్‌ పర్యవేక్షించారు.

సీఐ, ఎస్సై సస్పెన్షన్‌

నెల్లూరు(క్రైమ్‌): విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఓ సీఐ, ఎస్సైను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులను గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జారీ చేశారు. ఓ బాలికపై లైంగిక దాడి యత్నం ఘటనలో పోక్సో కేసును తోటపల్లిగూడూరు పోలీసులు నమోదు చేశారు. సదరు కేసులో నిందితుడిపై ముత్తుకూరు పోలీస్‌స్టేషన్లో సస్పెక్ట్‌ షీటుంది. ఏడాదిగా నిందితుడిపై పోలీసుల నిఘా కొరవడటంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు భావించి కృష్ణపట్నం పోర్టు సీఐ రవినాయక్‌, ముత్తుకూరు ఎస్సై ప్రసాద్‌రెడ్డిని విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారని సమాచారం.

దుబాయ్‌లో నారంపేట

యువకుడి అదృశ్యం

ఆత్మకూరు రూరల్‌: మండలంలోని నారంపేటకు చెందిన పాపసాని రాజశేఖర్‌ అనే యువకుడి ఆచూకీ పది రోజులుగా తెలియడంలేదని కుటుంబసభ్యులు ఆదివారం తెలిపారు. దుబాయ్‌లో సైబర్‌ గేట్‌ డిఫెన్స్‌ సెక్యూర్టీ విభాగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారని, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో ఆత్మకూరు పోలీసులను ఐదు రోజుల క్రితం ఆశ్రయించామని చెప్పారు. అయినా ప్రయోజనం లేదని, తమకు న్యాయం చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement