ప్రాక్టికల్స్‌కు 232 మంది గైర్హాజరు
నెల్లూరు(టౌన్): ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్‌కు సోమవారం జిల్లా వ్యాప్తంగా మొత్తం 232 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఉదయం 4,743 మందికి గానూ 4,597 మంది హాజరుకాగా 146 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ప్రాక్టికల్స్‌కు 4,310 మందికి గానూ 4,224 మంది హాజరయ్యారు. 86 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఆర్‌ఐఓ వరప్రసాదరావు 6 కేంద్రాలు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు 9 కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు 15 కేంద్రాలను తనిఖీ చేశారు.
పాడిపరిశ్రమ అభివృద్ధికి చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో పాడి పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో పశుసంవర్థక శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మాంసం, కోడిగుడ్ల ఉత్పత్తి పెంపుపై దృష్టి సారించాలన్నారు. పౌల్ట్రీ పరిశ్రమ నిర్వాహకులకు విద్యుత్ సబ్సిడీలు అందిస్తామన్నారు. దీనిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ అధికారికి సూచించారు. పాడి, పౌల్ట్రీ పరిశ్రమతోపాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి సారిస్తే గ్రామీణ ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయన్నారు. రైతులు, యువత ముందుకొచ్చి పాడి, పశుసంవర్థక రంగాల్లో పెట్టుబడి పెట్టి జిల్లాను ముందంజలో నిలపాలన్నారు. కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ జేడీ రమేష్ నాయక్, డీఆర్డీఏ, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్లు నాగరాజకుమారి, గంగా భవాని, పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
పరిహారం అందించాలని వినతి
నెల్లూరు(దర్గామిట్ట): కండలేరు ప్రాజెక్ట్ నిర్మాణంతో భూములు కోల్పోయిన తమకు పరిహారం అందించాలని రాపూరు మండలం గుండవోలు గ్రామస్తులు కోరారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గ్రామంలో పట్టా భూములకు పరిహారం అందజేశారని, ప్రభుత్వ నిబంధనల మేరకు డీకేటీ, సీజేఐఎఫ్‌ఎస్ భూములకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించలేదన్నారు. ప్రభుత్వం స్పందించాలని కోరారు.
విద్యార్థినిపై కుక్కల దాడి
సీతారామపురం: మండలంలోని తురకపాళెం ఉర్దూ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న రహమత్ అనే విద్యార్థినిపై సోమవారం కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో రహమత్ ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. బాధితురాలిని వెంటనే 108 అంబులెన్స్‌లో ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాలకులు, అధికారులు స్పందించి గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
జీవాల మందపై..
ఉదయగిరి రూరల్: మండలంలోని గండిపాళెం జగనన్న కాలనీలో పాముల రాజాకు చెందిన జీవాల మందపై సోమవారం కుక్కలు దాడి చేశాయి. దీంతో మూడు గొర్రె పిల్లలు మృతిచెందగా మరో నాలుగు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. ఆదుకోవాలని కోరుతున్నాడు.
కుటుంబ కలహాలతో
వ్యక్తి ఆత్మహత్య
సీతారామపురం: కుటుంబ కలహాలతో మండలంలోని సింగారెడ్డిపల్లి గ్రామంలో పసుపుల చెన్నయ్య (45) అనే వ్యక్తి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం మేరకు.. చెన్నయ్య ట్రాక్టర్ డ్రైవర్. ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి పాల్పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రాక్టికల్స్‌కు 232 మంది గైర్హాజరు
ప్రాక్టికల్స్‌కు 232 మంది గైర్హాజరు


