అంబటిపై దాడి అమానుషం
ఉదయగిరి : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాలు దాడికి పాల్పడటం అమానుషమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి నేతలు సాగించిన దుష్ప్రచారం బూటకమని సీబీఐ నివేదికతో బట్టబయలైందని చెప్పారు. అయినా టీడీపీ నేతలు ఇంకా దిగజారి నీచంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడాన్ని అంబటి ఖండిస్తూ వాటిని తొలగించాలని సూచించారన్నారు. ప్రభుత్వ దుర్మార్గ చర్యను ఖండించడాన్ని సహించలేక టీడీపీ గూండాలు ఆ పార్టీ పెద్దల కనుసన్నల్లో అంబటి ఇంటిపై దాడికి దిగి తగలబెట్టడం అరాచకమన్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి ప్రభుత్వ పెద్దల సూచనలతో బాధితుడైన అంబటిని ఆరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఈ దాష్టీకాన్ని చూస్తే రాష్ట్రంలో అరాచక, దుర్మార్గ పాలన నడుస్తోందనే విషయం అర్ధమవుతోందన్నారు. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, డైవర్షన్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు.


