ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి

Feb 2 2026 7:15 AM | Updated on Feb 3 2026 10:45 AM

-

మరొకరికి తీవ్రగాయాలు

కలిగిరి: మండలంలోని కలిగిరిలో కావలి – కలిగిరి జాతీయ రహదారిపై పెద్దచెరువు అలుగు సమీపంలో వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు టీవీఎస్‌ మోపెడ్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో తమ్మినేని శంకరయ్య (70) మృతిచెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. జలదంకి మండలం కేశవరానికి చెందిన చదలవాడ మాల్యాద్రి, చేజర్ల మండలం పెల్లేరుకు చెందిన శంకరయ్య మోపెడ్‌పై కలిగిరి వైపు వస్తున్నారు. పెద్దచెరువు అలుగు సమీపానికి వచ్చేసరికి కలిగిరి పైపు వేగంగా వస్తున్న ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ హారన్‌ కొట్టాడు. మోపెడ్‌ను నడుపుతున్న మాల్యాద్రి పక్కకు తప్పించబోయాడు. అదే సమయంలో వెనుక నుంచి బస్సు ఢీకొట్టింది. మోపెడ్‌తో సహా ఇద్దరూ కొంచెం దూరం ముందుకెళ్లారు. శంకరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మాల్యాద్రి కాళ్లు విరిగి, తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 వాహనంలో మాల్యాద్రిని వింజమూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రైవేట్‌ వైద్యశాలకు తీసుకెళ్లారు. శంకరయ్య గ్రామంలో వ్యవసాయ పనులు చేస్తుంటాడు. అలాగే పెళ్లి సంబంధాలు కుదురుస్తుంటాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై ఉమాశంకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని వివారాలు సేకరించారు. కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళేనికి చెందిన బస్సు డ్రైవర్‌ గోసాల సుబ్బరాజును అదుపులోకి తీసుకున్నారు. బస్సును స్వాధీనం చేసుకున్నారు. శంకరయ్య మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement