దూరం నుంచి వచ్చి.. అర్జీలందించి.. | - | Sakshi
Sakshi News home page

దూరం నుంచి వచ్చి.. అర్జీలందించి..

Jan 20 2026 8:29 AM | Updated on Jan 20 2026 8:29 AM

దూరం నుంచి వచ్చి.. అర్జీలందించి..

దూరం నుంచి వచ్చి.. అర్జీలందించి..

పోలీస్‌ కార్యాలయంలో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

నెల్లూరు(క్రైమ్‌): నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 95 మంది విచ్చేసి తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఎస్పీ ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య, నెల్లూరు రూరల్‌ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, లీగల్‌ అడ్వైజర్‌ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వినతుల్లో కొన్ని..

● దగదర్తికి చెందిన నరేంద్ర ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.5 లక్షలు తీసుకుని మోసగించాడని నెల్లూరు వేదాయపాళేనికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు.

● నా పేరుపై ఉన్న స్థలాన్ని, పొలాన్ని పెద్ద కుమారుడు రవి, కోడలు అమ్ముకున్నారు. నాకు యాక్సిడెంట్‌ జరిగినా పట్టించుకోలేదు. జీవనం కష్టతరంగా ఉంది. విచారించి న్యాయం చేయాలని దగదర్తికి చెందిన వృద్ధురాలు కోరారు.

● నా కుమారుడికి ముగ్గురు కుమార్తెలు. అతను చెడుఅలవాట్లకు బానిసై నన్ను, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నాడు. సంక్రాంతి పండగ రోజున కుమార్తెలపై వేడినీళ్లు పోసి తీవ్రంగా గాయపరిచాడు. అతని ద్వారా ప్రాణహాని ఉందని రాపూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు.

● నా భర్త గూడూరు రూరల్‌ పరిధిలో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని టీపీగూడూరుకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

● నా పెద్దనాన్న నాగభూషణం కోవూరులోని ఓ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఈనెల 14వ తేదీన రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం. లోతుగా విచారించాలని కోవూరుకు చెందిన వ్యక్తి అర్జీ ఇచ్చాడు.

● నేను కేన్సర్‌తో బాధపడుతున్నాను. నా భర్త విడాకులివ్వాలని వేధిస్తున్నాడు. అత్తింటివారు అతడికి సహకరిస్తున్నారని బాలాజీ నగర్‌కు చెందిన ఓ వివాహిత వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement