పార్టీలకతీతంగా త్వరలో సమావేశం
వాకాడు: గూడూరు నియోజకవర్గాన్ని ప్రజాభిప్రాయానికి భిన్నంగా విభజించడంపై త్వరలో పార్టీలకతీతంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు. దీనిపై సోమవారం కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నేతలు, ప్రజలు వాకాడులో చర్చించారు. నేతలు వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని కలిశారు. పార్టీలకతీతంగా జేఏసీతోపాటు అన్ని సంఘాలను కలుపుకొని సమావేశం ఎప్పుడు నిర్వహించాలో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యుడు కొడవలూరు భక్తవత్సలరెడ్డి విభజన వల్ల జరిగే లాభ, నష్టాలను నేతలకు వివరించారు. ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ఇటీవల జేఏసీ ఆధ్వర్యంలో కొన్ని సంఘాలు ధర్నాలు చేశాయన్నారు. గూడూరును ప్రజాభిప్రాయానికి భిన్నంగా విభజించడం జరిగిందన్నారు. క్రమంలోనే వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలో ఉంచి, కోట, చిల్లకూరు, గూడూరు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపడం వల్ల భవిష్యత్‌లో గూడూరు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. జేఏసీతోపాటు సంఘాలు స్నేహభావంతో కలిసికట్టుగా ముందుకొచ్చి గూడూరును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ ఏనుగు సుధాకర్ నాయకుడు, నేతలు పి.రాజశేఖర్‌రెడ్డి, డి.నాగూర్‌రెడ్డి, ఎన్.పెంచలరెడ్డి, ఎస్.మధురెడ్డి, జి.సుధాకర్‌రెడ్డి, రాజారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.


