ఆరు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో ఎస్పీ అజిత వేజెండ్ల పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా జిల్లాలో ఆరు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను బుధవారం ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి ఎస్సైను ఇన్‌చార్జిగా నియమించారు. ఈ క్రమంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయా బృందాలతో ఐజీ సమావేశం నిర్వహించి చేపట్టాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ప్రతి బృందం తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో నేర నియంత్రణపై దృష్టి సారించాలన్నారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. శివారు ప్రాంతాలు, అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్‌లు నిర్వహించాలన్నారు. రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేయాలన్నారు. లాడ్జీలు, హోటల్స్‌ను తనిఖీలు చేయడంతో పాటుగా వారాంతాలు, పండగ రోజుల్లో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, రూరల్ డీఎస్పీ జి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


