నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు
● కలెక్టర్ హిమాన్షు శుక్లా
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులకు సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌లో ఆయన తన చాంబర్‌లో జేసీ వెంకటేశ్వర్లు, ఉద్యానశాఖ అధికారులతో బుధవారం ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 35 వేల ఎకరాల్లో నిమ్మసాగు చేపట్టారని, ఇందులో ఈ సీజన్లో 25 వేల ఎకరాలు కాపునకు వస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో నిమ్మ విస్తీర్ణం పెరిగినందున మన ప్రాంతం నుంచి పంపించే నిమ్మకు డిమాండ్ తగ్గడంతో ధరలు కూడా పతనమయ్యాయని వివరించారు. దీంతో వెంటనే స్పందించిన కలెక్టర్ రాష్ట్రంలో నిమ్మ డిమాండ్ ఉన్న కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. జిల్లా నుంచి నిమ్మ పంటను ఆయా జిల్లాల్లో కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని కోరగా, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇందుకు సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు జిల్లా నుంచి నిమ్మ పంటను వెంటనే ఆయా జిల్లాలకు పంపించి రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ అనిత తదితరులు పాల్గొన్నారు.
కిలో నిమ్మకు రూ.15లైనా ఇవ్వండి
● జేసీ వెంకటేశ్వర్లు
పొదలకూరు : ప్రభుత్వ మార్కెట్ వ్యాపారులు కిలో నిమ్మకాయలకు కనీసం రూ.15లైనా అందజేయాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. స్థానిక నిమ్మమార్కెట్ యార్డు కార్యాలయంలో బుధవారం వ్యాపారులు, రైతులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాపారులు పెద్ద మనుస్సు చేసుకుని నెలరోజుల పాటు రైతులకు కనీసం రూ.15 అందజేయాల్సిందిగా సూచించారు. దిగుబడి అధికంగా ఉండడం వల్ల డిమాండ్ పడిపోయి ధరలు దిగజారినట్టుగా వ్యాపారులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఢిల్లీ మార్కెట్‌లో కాయలు వద్దంటున్నారని నష్టాలకు వ్యాపారం చేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు నెలరోజుల పాటు రైతులను ఆదుకుంటే తర్వాత ధరలు పెరుగుతాయని.. నిమ్మ సంక్షోభం నుంచి గట్టెక్కుతుందని జేసీ పేర్కొన్నారు. కొందరు రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం తమను ఆదుకోవాలని, పురుగు మందులు, ఎరువులను అందజేస్తే కొంత గట్టెక్కుతామని, ఉపాధి హామీలో కాయలను కోసేందుకు కూలీలను ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. జిల్లా ఉద్యానాధికారి సుబ్బారెడ్డి, మార్కెటింగ్ ఏడీ అనితాకుమారి, హెచ్‌ఓ ఆనంద్, ఏఎంసీ సెక్రటరీ ఇలియాజ్ పాల్గొన్నారు.
నిమ్మ రైతులు నష్టపోకుండా చర్యలు


