సాయం చేయబోయిన వ్యక్తిపై కత్తితో దాడి
● మద్యం మత్తులో
యువకుల వీరంగం
నెల్లూరు(క్రైమ్): మద్యం మత్తులో బైక్ నడుపుతూ అదుపుతప్పి రోడ్డుపై పడిన యువకులను లేపేందుకు వెళ్లిన వ్యక్తిపై సదరు యువకులు కత్తితో దాడిచేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటన వెంకటేశ్వరపురంలో చోటుచేసుకుంది. పోలీసులు, సేకరించిన సమాచారం మేరకు.. ఫూటుగా మద్యం సేవించిన ఇద్దరు యువకులు బైక్‌పై వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ చివర(పడుగుపాడు వైపు) నుంచి వెంకటేశ్వరపురం వైపు రాంగ్‌రూట్‌లో బయలుదేరారు. రోడ్డుపైనున్న స్పీడ్‌బ్రేకర్‌లను ఎక్కించే క్రమంలో బైక్ అదుపుతప్పడంతో యువకులు కిందపడ్డారు. వెనుక బైక్‌లో వస్తున్న వెంకటేశ్వరపురానికి చెందిన షేక్.బాబు గమనించి తన బైక్‌ను పక్కనే నిలిపి యువకులను లేపే ప్రయత్నం చేయగా వారు అతనిపై కత్తితో దాడిచేశారు. దీంతో బాబు కాలికి గాయమైంది. స్థానికులు యువకులను అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని సైతం కత్తితో వీరంగం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెప్పినా? కేసులు పెట్టినా చంపేస్తామని బెదిరిస్తూ యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాంకేతికత ఆధారంగా నిందితులు జనార్ధనరెడ్డి కాలనీ వారని తేలడంతో గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరారు.
సాయం చేయబోయిన వ్యక్తిపై కత్తితో దాడి


