టీడీపీ నేతలతో చెప్పించండి
● పైసలిస్తేనే పని
● దళిత రైతును ఇబ్బంది పెడుతున్న ఏపీఓ
అనుమసముద్రంపేట: ‘పైసలిస్తేనే పని జరుగుతుంది. కార్యాలయం చుట్టూ తిరగొద్దు. టీడీపీ నాయకుల చేత చెప్పించండి’ ఇది ఎవరో అన్న మాటలు కాదు. ఓ ప్రభుత్వ ఉద్యోగి దళిత రైతుని వేధిస్తున్న వైనమిది. బాధితుడు పిడుగు మాలకొండయ్య వివరాల మేరకు.. ఏఎస్‌పేట మండలం చిన్నఅబ్బీపురం గ్రామంలో ఆయనకు నాలుగు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో ఉపాధి హామీ పథకం కింద పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయమని గత నాలుగు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయితే మంజూరు చేయకపోగా ఎకరాకు రూ.7 వేలు డిమాండ్ చేశాడు. అంతేగాక పైఅధికారులు వచ్చినప్పుడు పెట్రోల్ ఖర్చులతో పాటు మధ్యాహ్న భోజనం పెట్టించాలని, దీనికితోడు టీడీపీ నాయకుల చేత సిఫార్సు చేయించుకోవాలని ఆ దళిత రైతుకు ఏఎస్‌పేట ఏపీఓ శ్రీనివాసరావు తెలిపారు. దీంతో రైతు మాలకొండయ్య 15 రోజుల క్రితం నెల్లూరులోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్‌కు సైతం అర్జీ ఇచ్చారు. అయినప్పటికీ ఫలితం లేదని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ఇప్పటికై నా స్పందించి పండ్ల తోటల పెంపకానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.


