లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు
● డీఎంహెచ్‌ఓ సుజాత
నెల్లూరు(అర్బన్): జిల్లాలోని స్కానింగ్ సెంటర్ల యాజమాన్యాలు లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ సుజాత హెచ్చరించారు. నెల్లూరు సంతపేటలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో మంగళవారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం సలహా సంఘ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్లలో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేయాలని సూచించారు. వైద్యుల రెఫరల్ స్లిప్పులు తీసుకుని స్కానింగ్ చేసి వాటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. గర్భిణులకు కాకుండా ఇతరులకు చేసే స్కానింగ్ వివరాలను వేరొక రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. సమావేశంలో పీసీ అండ్ పీఎన్‌డీటీ యాక్ట్ చైర్మన్ డాక్టర్ సీహెచ్ కిరణ్, సభ్యులు అనాటమీ అసోయేట్ ప్రొఫెసర్ డా.స్వర్ణలతా రెడ్డి, పీడియాట్రిషన్ డా.నానాజిరావు, డీఐఓ డా.ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓ నేతలు కవితారెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
జిల్లా జడ్జిగా ఎంపిక
నెల్లూరు (లీగల్): నెల్లూరు నగరానికి చెందిన తిరువళ్లూరు ప్రతిమ జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈమె 2003లో న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. 2020లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎంపికై పర్చూరులో విధులు నిర్వర్తించారు. 2023లో నెల్లూరు మొబైల్ ప్రత్యేక కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. ఇటీవల ఏపీ హైకోర్టు నిర్వహించిన జిల్లా జడ్జి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రతిమను పలువురు న్యాయవాదులు అభినందించారు.
8 సవర్ల బంగారు నగల మాయం
నెల్లూరు(క్రైమ్): బీరువాలోని నగలు మాయమైన ఘటనపై చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. మూలాపేట ఈఎస్‌ఆర్‌ఎం స్కూల్ సమీపంలో నిషాద్ కుటుంబం నివాసం ఉంటోంది. గతనెల 15వ తేదీ ఆమె బీరువాలోని ఎనిమిది సవర్ల బంగారు నగలు కనిపించలేదు. జరిగిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. వారితో కలిసి మంగళవారం చిన్నబజారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మహిళపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విశ్వంలో ఉచిత
నవోదయ మోడల్ టెస్ట్
తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్‌లోని విశ్వం విద్యాసంస్థల్లో గురువారం ఉదయం 10 గంటలకు జవహర్ నవోదయ విద్యాలయ – 2026 పరీక్షకు సంబంధించి ఉచిత మోడల్ టెస్ట్ జరుగుతుందని ఆ విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎన్.విశ్వనాథరెడ్డి మంగళవారం తెలిపారు. 6వ తరగతిలో ప్రవేశానికి జాతీయ స్థాయిలో ఈనెల 13వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షకు అనుగుణంగా ఈ నమూనా ఎగ్జామ్ జరుగుతుందన్నారు. ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా పరీక్ష రాయొచ్చన్నారు. విద్యార్థులు హాల్‌టికెట్ (అడ్మిట్ కార్డు) జెరాక్స్ కాపీని తీసుకురావాలన్నారు. వివరాలకు 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.
డ్రెయిన్‌లో మృతదేహం
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని బ్రహ్మదేవం గ్రామ బుడ్డీ డ్రెయిన్ శుభ్రం చేస్తుండగా మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. సుమారు 40 నుంచి 45 సంవత్సరాల వయసు ఉంటుందని భావిస్తున్నారు. ఐదురోజుల క్రితం నీటిలో మునిగి మృతిచెందినట్టు భావిస్తున్నారు. పోలీసులు వివరాలు సేకరించారు.
లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు


